కక్కలపల్లిలో ఘనంగా “బడి” పిలుస్తోంది

– ప్రభుత్వ పాఠశాలలో జోరుగా అడ్మిషన్లు : హెడ్మాష్టర్ గొర్తి వెంకట్ వెల్లడి

అనంతపురము, ఏప్రిల్ 18, (జనస్వరం) : పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “బడి పిలుస్తోంది” ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజాసమాఖ్య అధ్యక్షులు, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్తి వెంకటస్వామి తెలిపారు. నాణ్యమైన విద్య, ఆధునిక వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడే పిల్లల అడ్మిషన్లను ఖరారు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అడ్మిషన్ల ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 23 వ తేది వరకు కొనసాగుతుందన్నారు. ఏప్రిల్ 18 న స్కూల్ ర్యాలీ, సమావేశం, ఏప్రిల్ 20 – 21 తేదీల్లో నివాస ప్రాంతాల్లో సర్వే, పిల్లల గుర్తింపు ప్రక్రియ చేపడతామన్నారు. ఏప్రిల్ 23న అడ్మిషన్ కార్డుల పంపిణీ వుంటుందన్నారు. 5 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ పిల్లలు, 5వ తరగతి పూర్తి చేసి 6వ తరగతిలోకి వెళ్లే విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్ నుండి ప్రభుత్వ స్కూల్స్‌లోకి మారాలనుకునే వారు, బడిబయట వున్న పిల్లలు, డ్రాపౌట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అద్భుత ప్రయోజనాలు లభిస్తాయన్నారు. పిపి 1 నుండి 10వ తరగతి వరకు పూర్తిగా ఉచితవిద్య, అన్ని స్కూళ్లలో ఆంగ్లమాధ్యమంలో బోధన వుంటుందన్నారు. అర్హతగల ఉపాధ్యాయులు, అత్యున్నత శిక్షణ పొందిన టీచర్ల ద్వారా విద్యాబోధన సాగుతుందన్నారు. సంక్షేమ పథకాల్లో భాగంగా ఉచిత యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తామన్నారు. డిజిటల్ విద్య కోసం ఐ.ఎఫ్.బి ప్యానెల్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయన్నారు. రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండే వారికి రవాణా సదుపాయం లభిస్తుందన్నారు. విశాలమైన ఆటస్థలాలు, యోగా, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మన బడి – మన గర్వకారణమన్నారు. సమీపంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులను తల్లిదండ్రులు సంప్రదించాలని గొర్తి వెంకట్ సూచించారు. తెలుగుబిడ్డను భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు సమాజంపై కూడా ఉందన్నారు.

See also  పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు మానుకోండి : కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్