
క్షయ వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించాలి — ప్రముఖ ఊపిరితిత్తుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ సింగరాజు సాయికృష్ణ
సత్తెనపల్లి,మార్చి 24 (జనస్వరం)
స్థానిక పట్టణంలోని సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఊపిరితిత్తులు ప్రత్యేక వైద్యనిపుణులు డాక్టర్ సింగరాజు సాయికృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశం అత్యధికంగా 25 నుండి 25% క్షయ వ్యాధి కేసులు ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయని అన్నారు.సుమారు గంటకు 37 మంది చొప్పున మరియు 3 లక్షల మందికి పైన సంవత్సరానికి క్షయ వ్యాధి వలన చనిపోతున్నారు అని అన్నారు.క్షయ వ్యాధికి నూరుకు నూరు శాతం నివారించగలిగిన మందులు అందుబాటులో ఉన్నాయని, క్షయ వ్యాధిని ప్రాథమిక దశలోని గుర్తించాలని ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు,హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వారు, వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఈ వ్యాధి న బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని డాక్టర్ సింగరాజు సాయికృష్ణ అన్నారు.దీర్ఘకాలిక దగ్గు (2 వారాలకు పైన),కళ్ళే లో రక్తం పడుట, జ్వరం, అలసట, ఆకలి మందగించడం,బరువు తగ్గటం,చాతిలో నొప్పి రావడం,శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది రావటం మొదలగు లక్షణాలు ఉన్నవారు తక్షణమే క్షయ వ్యాధికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన సూచించారు.కేంద్ర ప్రభుత్వం క్షయ వ్యాధి నివారణ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న RNTCP ప్రోగ్రాం అనేది అన్ని ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉందని దానికి తగిన క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయని అందరూ కూడా పైన పేర్కొన్న లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలానే క్షయ వ్యాధి అనేది గాలి ద్వారా ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుంది కాబట్టి త్వరితగతిన జబ్బు నిర్ధారణ అయితే దీని యొక్క వ్యాప్తిని కూడా మనం అరికట్టవచ్చని ఆయన అన్నారు.








