డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న శ్రీ పవన్ కల్యాణ్ గారు…

డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న శ్రీ పవన్ కల్యాణ్ గారు…

             కృష్ణా జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న డోకిపర్రు ఆలయం భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో ఇంకా ప్రసిద్ధి చెందాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆకాంక్షించారు. ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించే విధానం మనసుని హత్తుకునేలా ఉందని, తిరుమలలో ఎలాంటి పూజా విధానం అమలులో ఉందో ఇక్కడా అదే రీతిలో సాగడం సంతోషదాయకం అన్నారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని డోకిపర్రు గ్రామంలో కొలువైన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎండీ శ్రీ పి.వి.కృష్ణారెడ్డి గారు, ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్  శ్రీ పిచ్చిరెడ్డి గారు కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

                      ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “రెండుమూడేళ్లుగా డోకిపర్రు రావాలనుకుంటున్నా.  బ్రహ్మోత్సవాలలోని కళ్యాణోత్సవానికి రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ శుభ సమయంలో పాల్గొనే అవకాశం కల్పించిన పారిశ్రామికవేత్తలు శ్రీ కృష్ణారెడ్డి గారు, శ్రీ పిచ్చిరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇక్కడకు ఆహ్వానించినందుకు మనస్పూర్తిగా వారికి ధన్యవాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా వారు సీఎస్ఆర్ కింద గ్రామానికి సమకూర్చిన సౌకర్యాలు అభినందనీయం. ముఖ్యంగా నిరంతర గ్యాస్ సరఫరా ఎంతో ఆకట్టుకుంది. భవిష్యత్తులో వారి సేవలు విస్తృతమై మరెంతో మందికి అందాలని ఆకాంక్షించారు.

వేద పండితుల ఆశీర్వచనం

              ఆలయ ట్రస్టీలు పవన్ కళ్యాణ్ గారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం   అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తొలుత ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి ఉపాలయాలుగా ఉన్న శ్రీ సీతారామ, వినాయక, శ్రీ లక్ష్మీనరసింహ, వరాహ, ఆలయాలను దర్శించారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొని  శ్రీ భూ సమేత వెంకటేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు.  పూజలు అనంతరం వేదపండితులు స్వామివారి తీర్ధప్రసాదాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందించి ఆశీర్వచనం ఇచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వామివారి హుండీలో కానుకలు  సమర్పించారు.

జనసేనానికి అడుగడుగునా ఘన స్వాగతం.. సమస్యలపై వినతిపత్రాలు 

See also  ఏనుగుతుని గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

               అంతకుముందు డోకిపర్రు వెళ్లేందుకు ఉదయం 10 గంటలకు శ్రీ పవన్ కల్యాణ్ గారు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, నిడుమోలు మీదుగా డోకిపర్రుకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి దారి పొడుగునా కార్యకర్తలు శ్రీ పవన్ కల్యాణ్ గారికి పూలవర్షంతో స్వాగతం పలికారు. ఉయ్యూరు వద్ద రైతులు, ప్రజలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. తమ సమస్యలపై గళం విప్పాలని, ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేందుకు సహకరించాలని కోరారు. నిడుమోలు వద్ద శ్రీ పవన్ కల్యాణ్ గారికి పామర్రు, గుడివాడ నియోజకవర్గాలతో పాటు  పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అప్పటి వరకు వందల సంఖ్యలో ర్యాలీగా వచ్చిన కార్యకర్తల సంఖ్య నిడుమోలులో వేల సంఖ్యకు చేరుకుంది. వందలాది బైకులు, కార్లు శ్రీ పవన్ కల్యాణ్ గారి వాహన శ్రేణిని అనుసరించగా పూల వర్షం మధ్య అందరికీ అభివాదం చేస్తూ డోకిపర్రు బయలుదేరారు. డోకిపర్రు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం పరిసర ప్రాంతాలు శ్రీ పవన్ కల్యాణ్ గారి వెంట తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కిటకిటలాడాయి.