
* కత్తిపూడి శివాలయం భక్తులతో కిటకిట
* భక్తులతో కిక్కిరిసిన కత్తిపూడి రహదార్లు
* శివనామ స్మరణతో మార్మోగిన కత్తిపూడి
* 571 కలశాలు, 571 సువాసినీలతో గ్రామోత్సవం
* 216 జాతీయ రాదారిపై భారీ అన్నదానం
* విజయవంతమైన మహా కుంభాభిషేకం
శంఖవరం, నవంబర్ 20 (జనస్వరం) ; భారతీయ హిందూ భక్త జనావళికి అత్యంత పవిత్రమైన, ప్రీతికరమైన కార్తీక మాసం కార్తీక అమావాస్య పర్వదినం, మార్గశిర మాసం ప్రారంభానికి ముందు రోజైన గురువారం మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవోపేతంగా భక్త జనుల నేత్రపర్వంగా జరిగింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలోని రావికంపాడు రోడ్డు కూడలిలో వెలసిన శ్రీశ్రీశ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంచాల సత్యనారాయణ, ఆయన సతీమణి ద్వయం ఈ ఉత్సవకర్తలుగా 13 వ మహాకుంభాషేకాన్ని, మహాన్నదానాన్ని భక్తజన రంజకంగా విజయవంతంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ ఆగమ ప్రతిష్టాచార్య, గాయత్రీదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ ఘంటసాల సోమేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ర్యాలీ సుబ్రహ్మణ్య కుమార్, చెరుకూరి వీరబాబు, చెరుకూరి ఆదిత్యశర్మ, గంటసాల దీక్షిత్ తోపాటు పలువురు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం 5 గంటలకు పూజా కార్యక్రమాలని ఆరంభించారు. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన వేదికపై ఉత్సవ విగ్రహాలకు ముందుగా మహాగణపతి పూజ, నవగ్రహ మండపారాధన నిర్వహించారు. తదుపరి పునఃపూజా కార్యక్రమాలు, చతుర్వేద స్వస్తి, గోపూజ, యాగ శాలలో ప్రత్యేక పూజలు, జపాలతో 13 వ మహా కుంభాభిషేక మహోత్సవాన్ని ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లను అభిషేకించేందుకు ముందుగా గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, గోదావరి, కృష్ణ, నర్మద సప్తనదుల నుంచి సేకరించిన పరమ పవిత్రమైన, శుద్ధ జలాలతో నింపిన 571 అఖండ కలశాలకు సోమేశ్వరశర్మ, సుబ్రహ్మణ్య కుమార్ ద్వయం స్థాపన, రుద్ర పారాయణ జపం, మహాకుంభ, మహారుద్ర హోమం, ప్రత్యేక పూజలు చేసారు. సప్త నదీ జలాలను 571 కలశాల్లో నింపి, వాటిని అభిషేక ద్రవ్యములతో కలపి, గ్రామానికి చెందిన 571 మంది సువాసినీలు, పుణ్యస్త్రీలు, ముత్తైదువలు ఆ కలశాలను శిరస్సుపై ధరించి గానా బాజా భజంత్రీలు, బాణా సంచా కాల్పుల కోలాహాలం నడుమ సుందరంగా అలంకరించిన పల్లకిలో శ్రీవిశాలాక్షీ సమేత విశ్వేశ్వర స్వామి దంపతుల ఉత్సవ విగ్రహాలను సుఖాసీనులను చేసారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మంచాల సత్యనారాయణ నేతృత్వంలో భక్తుల శివ నామస్మరణల మధ్య కత్తిపూడి గ్రామం అంతటా పల్లకీ సేవ గ్రామోత్సవ మహోత్సవ ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. కనుల పండుగగా జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామోత్సవం అనంతరం 21 మంది వేద పండితులు మంత్ర ఉచ్ఛారణలతో 571 కలశాల్లోని సప్త నదుల జలాలతో ఉదయం 11 గంటల నుండి స్వామి అమ్మవార్ల ఆలయ శిఖరానికి, గర్భాలయంలోని స్వామి, అమ్మ వారి మూల విరాట్టులకు ఏక కాలంలో భక్తులతో మహా కుంభాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మ వార్లకు అవబృద మంగళ స్నానం ఆచరింపజేసారు. వివిధ రకాల సుగంధ పుష్పాలు, పుష్ప మాలలతో కన్నుల పండుగగా సుందరంగా అలంకరించి పూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పాలను సమర్పించి భక్తులకు సర్వదర్శనం భాగ్యం కలిగించారు. వేద పండితుల వేద ఘోష నడుమ ఈ మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత భక్త జనరంజకంగా జరిగింది. భక్త మహాశయులు అందరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి కృపకు పాత్రులు అయ్యారు. పలువురు దాతల సహాయంతో ఉదయం 10 గంటల నుంచి స్వామి వారి ఆలయ ప్రాంగణం సన్నిధిలో సర్వజన భక్తులకూ అఖండ మహాన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుండి మహా గణపతి పూజ, ఆలయ శుద్ధి కొరకు పుణ్యాహ వాచనము రక్షా బంధన పూజ, ధారణ , దీక్షా వస్త్రధారణ, పంచగవ్య ప్రాశన, ఋత్విక్ వరుణ, నవగ్రహ మండప ఆరాధన, మహా కుంభాభిషేకం, అఖండ 651 కలశాల స్థామపన, మహారుద్ర పారాయణం, మహా మృత్యుంజయ జపం, ప్రనవగ్రహ జపం, మహా కుంభాభిషేక అదిష్టాన దేవతల ఆవాహనం, మహారుద్ర హోమ నీరాజన మంత్ర పుష్పములు, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ జరిగాయి. అనంతరం బ్రహ్మశ్రీ ఘంటసాల సోమేశ్వర శర్మను దుశ్శాలువతో కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసి పోయింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గౌతు సుబ్రహ్మణ్యం (నాగు), శ్రీ దుర్గాదేవి ఆలయ వ్యవస్థాపకులు గౌతు అర్జుబాబు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ కార్య నిర్వాహక కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, శ్రీ విశాలాక్షి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సేవా సమితి సభ్యులు విజయ, చంద్రారెడ్డి, దుర్గారావు, అధిక సంఖ్యలో వివిధ గ్రామాల భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.









