
హైదరాబాద్, జూలై 23 (జనస్వరం): ఓటు మన జన్మహక్కు అని, దానిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఏఐసీసీ జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ పి.వి. రవి శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం ఎర్రగడ్డ డివిజన్‌లోని కళ్యాణ్ నగర్ వెంచర్-3, సారథి సొసైటీ, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కేంద్రాలను సందర్శించి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలతో ఎస్‌ఐఆర్ నిర్వహణపై వివరాలు తెలుసుకుని, పలువురు ఓటర్లకు ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారమ్‌లను అందజేశారు. ఓటరు జాబితాలో పేరు, వివరాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకరిస్తారని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరికి సరైన మార్గదర్శకత్వం అందించాలని బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఎస్‌ఐఆర్ గడువు సమీపిస్తున్నందున ప్రతి ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో కొనసాగేందుకు ఎన్యుమరేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపి గడువులోగా సమర్పించాలని డాక్టర్ రవి శేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. “నా ఓటు – నా హక్కు” అనే భావనతో ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ నగర్ వెంచర్-3 సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగళ్ల నరసింహారావు, సారథి సొసైటీ అధ్యక్షుడు కోటేశ్వర్ రావు, అడ్వైజర్ నరసింహా రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బా నాయుడు, కార్యదర్శి కృష్ణకుమార్, రాజీవ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వీర రాఘవ చౌదరి, కాంగ్రెస్ నాయకులు టి. వినోద్ కుమార్, నాగరాజు, భరత్ కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.








