నెల్లిమర్ల నియోజకవర్గంలో కాలుష్య నివారణే ధ్యేయం : ఎమ్మెల్యే లోకం మాధవి

నెల్లిమర్ల, జనవరి 12, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గంలో పెరుగుతున్న కాలుష్య సమస్యలపై నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) సభ్యుడు డాక్టర్ సందీప్ పంచకర్లతో ఆమె మర్యాదపూర్వక భేటీ నిర్వహించి నియోజకవర్గంలోని పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పరిశ్రమలు, ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న బూడిద, వరి పొట్టు వంటి వ్యర్థాల కారణంగా త్రాగునీటి వనరులు తీవ్రంగా కలుషితం అవుతున్నాయని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. కలుషిత నీరు, గాలి కాలుష్యం వల్ల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పరిస్థితులు ఇకపై సహించబోమని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని అదుపు చేసేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేయాలని, పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కాలుష్య నివారణ, వ్యర్థాల నిర్వహణలో డాక్టర్ సందీప్ పంచకర్ల తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే అభినందించారు. పర్యావరణ పరిరక్షణతోనే ప్రజల ఆరోగ్యం, వ్యవసాయ భూముల భద్రత సాధ్యమని పేర్కొంటూ, కాలుష్య రహిత నియోజకవర్గమే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. నెల్లిమర్ల ప్రజలకు స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని డాక్టర్ సందీప్ పంచకర్ల హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కాలుష్య నివారణ చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండబోదని, ప్రభుత్వ నిబంధనల అమలులో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు.

See also  జనసేన వీర మహిళకు 26000 సాయం అందించిన నెల్లూరు జనసైనికులు