
ఎస్కేయూ, అనంతపురము, మార్చి 13, (జనస్వరం) : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గ్రామీణాభివృద్ధి విభాగంలో పరిశోధనలు చేసినందుకు గాను సుద్దుల సుధకు పిహెచ్డీ డాక్టరేట్ ప్రదానం చేశారు. గ్రామీణాభివృద్ధి, సామాజిక కృషి విభాగం అధ్యక్షులు, పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులు ఆచార్య ఎం. మునినారాయణప్ప పర్యవేక్షణలో ఆమె “అనంతపురం జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో దివ్యాంగుల భాగస్వామ్యం” అనే అంశంపై పరిశోధనలు చేశారు. ఈ అంశంపై ఆమె చేసిన పరిశోధనలు గ్రామీణ ప్రాంతాల్లో దివ్యాంగుల ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇదే విషయం గురించి పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, జర్నల్స్‌లో పరిశోధనా వ్యాసాలు వెలువరించారు. ఆమె పరిశోధనలకు గాను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గ్రామీణాభివృద్ధి విభాగం పీహెచ్‌డీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా విభాగానికి చెందిన ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు సుద్దుల సుధను అభినందించారు. ఆమె చేసిన పరిశోధనలు భవిష్యత్తులో గ్రామీణాభివృద్ధి విధానాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దివ్యాంగుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపారు. కుటుంబ సభ్యులు, మిత్రులు, సహ పరిశోధకులు సుద్దుల సుధకు శుభాకాంక్షలు తెలియజేశారు.








