
ప్రజా సమస్యలపై బాధ్యతతో కూడిన పోరాటం మన విధానం
* సమస్యలపై పోరు కోసం శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలు
* సమస్యలు పరిష్కరించుకొనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు
* నిజాయతీతో కూడిన రాజకీయాలు చేస్తేనే జనాదరణ
* సంక్షేమం పేరిట సొమ్ములిచ్చి మద్యం పేరుతో లాగేస్తున్నారు
* జనసేన కార్యకర్తలకు భరోసాగా నిలుస్తాం
* క్రియాశీలక సభ్యత్వ నమోదు పూర్తి చేసిన నియోజకవర్గాల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు
అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు వెనకేసుకోవడం కాదు… ప్రజలు కోల్పోయిన వాటిని వారికి అందజేయడం కావాలి… జనసేన పార్టీ అది చేస్తుందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. ఒక సమస్య ఉంటే దాని గురించి బలంగా ప్రస్తావించి మాట్లాడితే – వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా దాన్ని పరిష్కరిద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. నేను కోరుకుంటున్న క్రియాశీలక సభ్యులు ప్రజలు, పార్టీకి అందుబాటులో ఉండేవారై ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం ఉదయం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల ఇంచార్జులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆ అయిదు నియోజకవర్గాల్లో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి అమలు చేస్తున్న ప్రమాద భీమా వివరాలను వెల్లడించారు. ఈ సభ్యత్వం పొందినవారికి రూ.5 లక్షలు ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తున్నారు. భీమా ధ్రువపత్రాలను శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రదానం చేశారు. ప్రమాద భీమా ప్రక్రియను సిద్ధం చేసిన ఆడిటర్ శ్రీ ఎ.వి.రత్నంను అభినందించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “నాకు జీవితంలో పారిపోవడం తెలియదు…. ఏ సమస్యనైనా ధైర్యంగా. ఎదుర్కొంటా. ఏదైనా అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా చెబుతా. కార్యకర్తల నుంచే నాయకులను తయారు చేసుకోగల సత్తా పార్టీకి ఉంది. క్షేత్రస్థాయిలో నిజాయతీగా పార్టీ జెండా పట్టుకొని పోరాటం చేసే కార్యకర్తలను పార్టీ కంటికి రెప్పలా కాపాడు కుంటుంది. క్రియాశీలక సభ్యత్వంలో కాన్షీరామ్, దళిత ఉద్యమాల నుంచి స్ఫూర్తిని తీసుకున్నాం. పోరాటయాత్రలో (భాగంగా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా పార్టీ జెండా పట్టుకొని నిస్వార్ధంగా పనిచేసే కార్యకర్తలను చూశాను. తోపుడు బండి మీద వ్యాపారం చేస్తూ కూడా తమకు వచ్చిన కొద్దిపాటి ఆదాయంలో కొంత పార్టీ కోసం ఖర్చు చేసే జనసైనికులు తారసపడ్డారు. వారందరికి పార్టీ తరపున అండగా నిలబడాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా 5 నియోజకవర్గాల్లో ప్రారంభించాం. ఈ ఐదు నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేసి కొండంత ధైర్యం ఇచ్చారు. నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీ అందరికి ధన్యవాదాలు.
విలువలతో కూడిన రాజకీయాలతోనే జనాదరణ :
2019 సార్వత్తిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైనా… ఇవాళ ప్రజలకు సమస్య వస్తే ముందుగా గుర్తొచ్చేది మాత్రం జనసేన పార్టీయే. పరాజయం తర్వాత కూడా ఇంతటి జనాదరణకు కారణం… విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే. ప్రజా సమస్యలపై బాధ్యతతో పోరాటం చేయడమే. కొత్త ప్రభుత్వం గద్దెనెక్కిన మూడు నెలలకే భవన నిర్మాణరంగం కూప్పకూలింది. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన, బాధ చూడలేక వారి తరపున పోరాటం చేస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం విశాఖపట్నంలో నిరసన కవాతు చేపట్టాను. అయితే ఆ రోజు అంతమంది నా వెనుక నడుస్తారని ఊహించలేదు. జనం వస్తే వస్తారు… లేకపోతే నాతో వచ్చిన పదిమందితోనైనా నడిచి నిరసన తెలపాలని అనుకున్నాను. కానీ మన ప్రయత్నం మంచిది కాబట్టి ఆ రోజు ఇసుకేస్తే రాలనంతమంది జనం వచ్చారు. జనం వస్తారని పోరాటం చేయొద్దు. నిజాయితీగా పోరాటం చేస్తే మనతో పాటు జనం నడుస్తారు. మనం నిలబడితే వాళ్లు కూడా నిలబడతారు.
యువతలో ఆవేదన, ఆవేశం మెండుగా ఉన్నాయి :
రాజకీయ నాయకులు తమ అవసరాలు పరిస్థితులకు తగ్గట్టు మాట మార్చేస్తూ ఉంటారు. అమరావతి విషయంలో అదే జరిగింది. సంక్షేమం పేరుతో సొమ్ములు ఇచ్చినట్టే ఇచ్చి మద్యం, ఇతర మార్గాల ద్వారా పేదలకు ఇచ్చింది లాక్కుంటున్నారు. ఇటువంటి వాటిని ప్రశ్నించడానికి బలమైన సమూహం కావాలి. యువతలో ఆవేశం, ఆవేదన మెండుగా ఉన్నా.. చివరి వరకు పోరాడే ఓపిక అవసరం. ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదురైనా పోరాటాన్ని ఆపవద్దు. సమస్యలను ఎలా గుర్తించాలి, గుర్తించిన వాటిపై ఎలా పోరాటం చేయాలి, వాటిని లీగల్ గా ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై త్వరలోనే ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం.
గ్రామ స్థాయిలో సమస్యల మీద గళం విప్పాలి అంటే బలమైన సమూహం కావాలి. అందుకు తగ్గట్టు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం. మేము పెట్టుకున్న లక్ష్యం కంటే ఎక్కువ మంది రావడం చాలా బలాన్ని ఇచ్చింది. జనసేన పార్టీ అంటే ఒక వ్యక్తి మీద అభిమానం, సమాజశ్రేయస్సు కోరుకోనే వ్యక్తుల సమూహం. కార్యకర్తలు అందరూ వ్యక్తిగత అభిమానంతో పనిచేస్తారు. వీరందరిని ఒక గొడుకు కిందకు తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. సొంత డబ్బు పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్ళే వ్యక్తులు మిగతా పార్టీల్లో చాలా అరుదుగా ఉంటారు. మన పార్టీలో మాత్రం కోకొల్లలుగా ఉన్నారు. 2024 ఎన్నికలను బలంగా ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చింద”ని అన్నారు.
సామాన్యులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు :
అంతకు ముందు పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “క్రియాశీలక సభ్యత్వ ప్రస్తావన వచ్చినప్పుడు కోవిడ్ నేపథ్యంలో 175 నియోజకవర్గాల్లో ఒకటేసారి మొదలు పెట్టవద్దని శ్రీ పవన్ కల్యాణ్ గారు సూచించారు. ముందుగా అయిదు నియోజకవర్గాలు ఎంపిక చేశారు. అది ఆయా నియోజకవర్గాల పట్ల మన అధ్యక్షుల వారికి ఉన్న గౌరవం. ఎంపిక చేసిన 5 నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారు. అంతా కష్టపడి పని చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత అనుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గ్రామాల్లో రోడ్ల వెంట వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అంతగా రోడ్లు దెబ్బతిన్నాయి. సామాన్యుడిని ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది. ఇలాంటి పరిపాలన ఎప్పుడూ చూడలేదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఆ ప్రజలకు మనం అండగా నిలవాలి.
ముఖ్యంగా రాజోలులో పార్టీ తరఫున గెలిచిన అభ్యర్ధి నుంచి సహకారం లేకున్నా స్థానిక నాయకత్వం ముందుకు వచ్చింది. 16 మంది రంగంలోకి దిగి బాధ్యత చేపట్టారు. పట్టుదలతో పార్టీపై విశ్వాసంతో నిలకడగా, నిజాయితీగా కష్టపడి పని చేశారు. క్రియాశీలక సభ్యత్వానికి రూ. 500 రుసుము ఏర్పాటు చేయడానికి కారణాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీరందరికీ పార్టీ తరఫున శిక్షణ ఇవ్వడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించి వారిలో భరోసా నింపుతాం. ఇది ఏ ఒక్కరి వల్ల కాదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లాలి పట్టుదల ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఏ సంస్థ అయినా ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. ఒక టీమ్ ఏర్పడి ఆ టీమ్ బిల్డప్ ప్రక్రియలో రాజోలు ఆదర్శవంతంగా నిలిచింది. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. మిమ్మల్ని నడిపించింది జిల్లా నాయకత్వం. అది కూడా హర్షించదగిన అంశం.
ఎన్.ఆర్.ఐ. జనసైనికుల తోడ్పాటు అభినందనీయం :
ఇన్సూరెన్స్ పాలసీ విషయానికి వస్తే ప్రపంచ స్థాయి పాలసీని తీసుకువచ్చాం. కార్యకర్తలకు భరోసాగా నిలవాలన్నది మన అధ్యక్షుల వారి సంకల్పం. చాలా మంది ఎన్.ఆర్.ఐ. జనసైనికులు ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లారు. వారి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. గ్రామ స్థాయిలో చేపట్టే కార్యక్రమాలకు వారంతా చక్కగా మద్దతు, తోడ్పాటు ఇస్తున్నారు. వారి కోరిక మేరకు ఉన్నత ప్రమాణాలతో ఈ పాలసీని తీసుకువచ్చాం. రూ. 50 వేల వరకు చికిత్స చేయించుకునే విధంగా పాలసీ తీసుకురాగలిగాం. పాలసీ అవసరం అవుతుందన్న భావన ఎవరికీ ఉండదు. కానీ పార్టీ తరఫున ఒక భరోసా కల్పించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. బాధితుల కుటుంబాలకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిన పాలసీ ఇది.
ఇన్సురెన్స్ వ్యవహారాలు చూసుకోవడం కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక విభాగం ఏర్పాటు చేశాం. ఈ విభాగం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. సమాచారం అందిస్తే వెంటనే స్పందించే విధంగా ప్రతి జిల్లాలో ఒక లీగల్ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛందంగా ఓ సేవా కార్యక్రమంలా దీన్ని చేస్తామని ముందుకు వచ్చిన న్యాయవాదులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. రూ. 5 లక్షల రూపాయిల భీమా పాలసీ కచ్చితంగా భరోసా కల్పిస్తుంది. ఈ భీమా విధానం సిద్ధం చేయడంలో శ్రీ ఎ.వి.రత్నం, శ్రీ సాంబశివ ప్రతాప్ కృషి చేశారు. మధ్యతరగతి కుటుంబాలు, చిన్న కుటుంబాల వారికి పని ఒత్తిడిలో ఇన్సురెన్స్ చేయాలన్న ఆలోచన రాకపోవచ్చు. వారికి ఇది అందుబాటులో ఉంటుంది. రెండో విడత కార్యక్రమాన్ని 32 నియోజకవర్గాల్లో బుధవారం శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రారంభించబోతున్నారు. అందుకోసం ఓ యాప్ సిద్దం చేశామ”న్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, పార్టీ పి.ఎ.సి. సభ్యులు శ్రీ ముత్తా శశిధర్, శ్రీ కందుల దుర్గేష్, శ్రీ పంతం నానాజీ, శ్రీ మనుక్రాంత్ రెడ్డి, పార్టీ నేతలు శ్రీ దాసరి రాజు, శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, శ్రీ టి.సి.వరుణ్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల కరోనాతో మృతి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలకు సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.








