భోగాపురం సీహెచ్‌సీ అభివృద్ధిపై ఎమ్మెల్యే లోకం మాధవి సమీక్ష

భోగాపురం, అక్టోబర్ 8, (జనస్వరం): భోగాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మౌలిక వసతులు, వైద్య సేవల పురోగతిపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఈరోజు సమీక్ష జరిపారు. వైద్యులు, కమిటీ సభ్యులతో కలిసి ఆసుపత్రి పరిస్థితులను పరిశీలిస్తూ అనేక కీలక సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఆసుపత్రిని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీహెచ్‌సీలో భవనాల చిన్న మరమ్మతులు, మౌలిక సదుపాయాల ఏర్పాటును తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. పరిశుభ్రతపై ఎలాంటి రాజీ లేకుండా ఆసుపత్రి ప్రాంగణం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని చెప్పారు. భద్రత దృష్ట్యా ప్రహరీ గోడ నిర్మాణం, రాత్రివేళల్లో లైటింగ్ ఏర్పాటు అత్యవసరమని పేర్కొన్నారు. రోగులు, సిబ్బందికి అవసరమైన ప్రాథమిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. డాక్టర్లు, సిబ్బంది రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు మరింత కృషి చేయాలన్నారు. జిల్లాలో రక్త నిల్వ కొరతను దృష్టిలో ఉంచుకుని రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు ఆసుపత్రిని సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షలో పాల్గొన్న అధికారులు ఎమ్మెల్యే సూచనలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

See also  పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల ఏర్పాట్ల పర్యవేక్షణ