
తిరుపతి, డిసెంబర్ 13 : విశ్వం టాలెంట్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. 2025–2026 విద్యాసంవత్సరానికి గాను నిర్వహించిన బ్రెయిన్‌ఫీడ్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో విద్యారంగంలో నిరంతర నాణ్యత, నవీన బోధనా విధానాలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో ముందుకు సాగుతున్న తిరుపతి విశ్వం టాలెంట్ స్కూల్ కు “బెస్ట్ అకడమిక్ ఎక్సలెన్స్ స్కూల్”, “బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కూల్” విభాగంలో ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా విశ్వం విద్యాసంస్థల చైర్మన్ డా. ఎన్.విశ్వనాథ్ రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో బలమైన పునాదిని ఏర్పరచడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అందుకోసం విశ్వం టాలెంట్ స్కూల్‌లో సాధారణ పాఠ్యాంశాలను పోటీ ప్రవేశపరీక్షల తయారీతో సమన్వయం చేసి ప్రత్యేక అధ్యయన విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా సైనిక్ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయాలు, మిలిటరీ స్కూల్స్ ప్రవేశపరీక్షలకు సమగ్ర శిక్షణ అందిస్తూ, విద్యార్థులను చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి భావనలతో తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. అవార్డ్స్ నిర్వాహకులు మాట్లాడుతూ విశ్వం టాలెంట్ స్కూల్ అకడమిక్ ఫలితాలు, జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో సాధిస్తున్న విజయాలు, నాణ్యమైన బోధన విధానం, సాంకేతిక సదుపాయాలతో కూడిన మౌలిక వసతులు, విద్యార్థులకు అందిస్తున్న సురక్షిత వాతావరణం కారణంగా ఈ అవార్డులు అందజేశామని తెలిపారు. అంతేకాకుండా, 2025 సైనిక్ స్కూల్ ప్రవేశపరీక్షలో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంక్ సాధించడం విశ్వం టాలెంట్ స్కూల్ విద్యాప్రమాణాలకు గట్టి నిదర్శనమని వారు ప్రశంసించారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసం కోసం విశ్వం టాలెంట్ స్కూల్‌లో డిజిటల్ క్లాస్‌రూములు, విశాలమైన క్యాంపస్, ఆధునిక ల్యాబ్స్, క్రీడా సదుపాయాలు, శుభ్రమైన హాస్టల్ వసతులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ విద్యాతత్వమని వారు స్పష్టం చేశారు. ఈ ఘనత సాధించడంలో సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం, సిబ్బంది అందరికీ వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.









