గంగానగరం గ్రామ పంచాయతీ సమస్యపై జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి హామీ

పిఠాపురం, అక్టోబర్ 2, (జనస్వరం) : పిఠాపురం నియోజకవర్గంలోని విరవాడ గ్రామం–పిఠాపురం పట్టణానికి మధ్యలో ఉన్న గంగానగరం గ్రామ ప్రాంతం సుమారు 60 సంవత్సరాలుగా ఏ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందో తెలియని పరిస్థితిలో కొనసాగుతుండటంతో, అక్కడ నివసిస్తున్న ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక శెట్టిబలిజ సోదరులు కోరారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, డిసిసి బ్యాంక్ చైర్మన్ **తుమ్మల రామస్వామి (బాబు)**తో పాటు కాకినాడ పార్లమెంటు సభ్యుడు తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ దృష్టికి ఈ సమస్యను చేరవేశారు. గంగానగరం గ్రామ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి స్వయంగా గంగానగరం గ్రామాన్ని సందర్శించి, అక్కడ నివసిస్తున్న శెట్టిబలిజ సోదరుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ వాకాపల్లి దేవి సూర్యప్రకాష్, ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ వూట నాని బాబు, విరవాడ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కురాకులు వీరబాబు, రామిశెట్టి సూరిబాబు, మైనం స్వామి, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  అమలాపురం నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం