క్రీడాస్ఫూర్తితో రాణించాలి : విద్యావేత్త గొర్తి వెంకట్ పిలుపు

అనంతపురము, ఫిబ్రవరి 21 : యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజాసమాఖ్య అధ్యక్షులు, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్తి వెంకటస్వామి అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రమశిక్షణతో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం కక్కలపల్లి పాఠశాలలో విద్యార్థులకు చెస్, క్యారం వంటి ఇండోర్ గేమ్స్ ను హెడ్మాష్టర్ ప్రారంభించారు. జీవితంలో లక్ష్యాలను సాధించడానికి, ఉన్నత శిఖరాలకు చేరడానికి క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమన్నారు. క్రీడలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించి, ఏకాగ్రతను పెంచుతాయన్నారు. ఆటలో గెలుపు కంటే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం చాలా ముఖ్యమన్నారు. ఓడిన వారు నిరుత్సాహపడకుండా, మరోసారి గెలుపు కోసం ప్రయత్నించాలని సూచించారు.క్రీడలు లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు వాటిని సాధించే దిశగా కృషి చేయడం నేర్పుతాయన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతూ జిల్లా, రాష్ట్ర స్థాయిలలో రాణించి, మంచి పేరు తీసుకురావాలని కోరారు. అలాగే “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమాన్ని కూడా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ నెల థీమ్ “జీరో లిటర్ గవర్నెన్స్” గురించి అవగాహన కల్పించారు. తడి – పొడి చెత్త వేరువేరు సేకరణ, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ ప్రాముఖ్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

See also  కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది