గండవరం వడ్డిపాలెంలో జంట హత్యలు కలకలం

– ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గండవరం గ్రామం

– రక్తపు మడుగులో మృతులు కందుర్తి వెంకటేష్, బాల వెంకయ్యగా గుర్తింపు

– ఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలపై ఆరా తీసిన రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు

– కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఆధారాలు సేకరించిన క్లూస్ టీం

కొడవలూరు, మార్చి 30 (జనస్వరం) : మండలంలోని గండవరం గ్రామం వడ్డిపాలెంలో ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మృతులు దగదర్తి మండలం పెదపుత్తెడు గ్రామానికి చెందిన కందుర్తి వెంకటేష్, సంగం మండలం వెంగారెడ్డిపాలెంకు చెందిన బాల వెంకయ్యగా గుర్తించారు. పొలాల్లోని గడ్డి చుట్టే యంత్రానికి డీజిల్ కోసం ఆదివారం రాత్రి కొడవలూరులోని ఓ పెట్రోల్ బంకుకు వెళ్లి డీజిల్ తీసుకుని తిరుగు ప్రయాణంలో గండవరం మార్గమధ్యంలోని వడ్డిపాలెంలో రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి సోమవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. డీఎస్పీ మాట్లాడుతూ, మృతుడు వెంకటేష్‌కు గతంలో వివాహేతర సంబంధం ఉన్నట్లు, ఆ మహిళకు చెందిన వ్యక్తి ఇటీవల గ్రామంలో అతడిని అడ్డుకుని బెదిరించినట్లు సమాచారం ఉందన్నారు. ఈ విషయంపై వెంకటేష్ తండ్రి కూడా మా కుమారుడిని వదిలేయాలని కోరినప్పటికీ, అదే కారణంగా ఈ హత్య జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ కేసులో హత్యకు గల అసలు కారణాలు వెలికి తీయడానికి క్లూస్ టీం, పోలీసులు ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

See also  పిచ్చి మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్న వైసీపీ ప్రభుత్వం