
అనంతపురము, అక్టోబర్ 22, జనస్వరం : ద్విభాషా కవి డా. జూటూరి షరీఫ్ రాసిన “చెట్టు” వచన కవిత్వ పుస్తకాలను పలు గ్రంధాలయాలకు ఉచితంగా అందజేశారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయం, మహిళ, బాలల గ్రంథాలయాలకు ఆయన స్వయంగా బహుకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ లైబ్రేరియన్ కమ్మన్న, అసిస్టెంట్ లైబ్రేరియన్ గోవిందు, మహిళా గ్రంథాలయ అధికారి శ్రీపతి లకు షరీఫ్ పుస్తక వితరణ చేశారు. అనంతరం విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పండిట్ రియాజుద్దీన్ అహ్మద్, సాహిత్య భారతి వ్యవస్థాపకులు గుంటి మురళీకృష్ణ తదితరులు మాట్లాడారు. రాయలసీమ ఆధునిక సాహిత్యంలో వచనశతకం రాసిన తొలికవి డాక్టర్ జూటూరి షరీఫ్ అని పేర్కొన్నారు. ఆయన రచించిన “చెట్టు” వచన శతకం ఎంతో వినూత్నమన్నారు. రాయలసీమలో వచన శతకం రాసిన వారిలో జూటూరు షరీఫ్ మొదటివాడన్నారు. పర్యావరణ విధ్వoసాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన కావ్యమని, తన కావ్యం ద్వారా ప్రజలలో పర్యావరణ చైతన్యాన్ని జూటూరు షరీఫ్ నింపాడని చెప్పారు. పర్యావరణ కవిత్వంలో జూటూరు షరీఫ్ రచించిన చెట్టు వచన శతకం మైలురాయి వంటిదన్నారు. చెట్టును కేంద్రంగా చేసుకొని ప్రభావశీలంగా, కవితాత్మకంగా వచన శతకం రాయడం అభినందనీయమన్నారు. అనంతరం జూటూరు షరీఫ్ ను పలువురు పాఠకులు, సాహితీ మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాల సిబ్బంది ప్రవల్లిక, ముత్యాలమ్మ, శివమ్మ, శిరీష, ఉజ్జీనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ పూర్వ సభ్యులు, శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, రాయలసీమ ప్రజాసమాఖ్య అధ్యక్షులు గొర్తి వెంకటస్వామి ప్రత్యేకంగా షరీఫ్ ను అభినందించారు. సామాజిక ప్రయోజనాలను చేకూర్చే పుస్తకాలను గ్రంథాలయాలకు ఉచితంగా అందించి, పాఠకులు, ప్రజలకు స్ఫూర్తినివ్వడం ప్రశంసనీయమన్నారు.









