అనంతపురం, జూన్ 25 (జనస్వరం): జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న “నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల”లో అనంతపురం పార్లమెంట్ పరిధికి దేవన సంతోష్ కుమార్‌ను అబ్జర్వర్‌గా నియమించారు. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో, పార్టీని గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు, అనంతపురం జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌కు దేవన సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నిర్మాణంలో భాగస్వాములైన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, కార్యకర్తల వివరాల సేకరణ, సంస్థాగత వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడం, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో నిర్మాణాత్మక కార్యకలాపాలను వేగవంతం చేయడమే కమిటీ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ నియామకంతో అనంతపురం పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ నిర్మాణ కార్యక్రమాలకు మరింత ఊపు వస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.








