బాబు జగ్జీవన్ రామ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ : MSSS

అనంతపురం, ఏప్రిల్ 05 (జనస్వరం) : భారత మాజీ కేంద్ర మంత్రి బాబు జగ్జీవన్ రామ్‌కు భారతరత్న ప్రకటించాలని మాదిగ సంక్షేమ సేవా సంఘం (MSSS) నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం నగరపాలక కార్యాలయం ముందు ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన 118వ జయంతి సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాకే రామతీర్థ, జిల్లా అధ్యక్షులు మన్నల సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షులు ఎక్కలూరి నాగరాజు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఉప ప్రధానమంత్రిగా, రైల్వే, పురపాలక, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖల వంటి కీలక విభాగాల్లో కేంద్ర మంత్రిగా సేవలందించి ఆయా శాఖలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. సుమారు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా సేవలందించిన ఆయన విద్యార్థి దశ నుంచే సామాజిక న్యాయం కోసం పోరాడి స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారని గుర్తుచేశారు. దేశ అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు అపారమని, ఇంతటి ఘన చరిత్ర కలిగిన నాయకుడికి భారతరత్న ప్రకటించడం ద్వారా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆయన సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి నేటి తరాలకు ఆదర్శమని తెలిపారు. దళితుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని గౌరవంగా పరిగణించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సి. శంకరయ్య, కోటంక మల్లేష్, గూడూరు చంటి, జరుపుల రాణా ప్రతాప్, ప్రసాద్, సాకే నరేష్ తదితరులు పాల్గొన్నారు.

See also  PAC సభ్యులు మధుసూదన్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి 50 మంది చేరిక