
విజయవాడ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, నవంబర్ 6, జనస్వరం : నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో నైపుణ్యాలు మెరుగుపరచుకుంటేనే ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆవుల చంద్రశేఖర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న తాజా పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు, విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. సాంకేతిక విప్లవంతో 5జి, 6జి, కృత్రిమ మేధ, డేటా కేంద్రాలు, అటానమస్ వెహికల్స్, క్వాంటం కంప్యూటింగ్, మెడికల్ ఇమేజింగ్, బయో సెన్సర్స్ వంటివి అందుబాటులోకి వచ్చాయన్నారు. వర్తమానంలో ఎలక్ట్రానిక్స్ ప్రభావం ఉందని, భవిష్యత్తును పోటానిక్ లే శాసిస్తాయని అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆడిటోరియంలో గురువారం ఉదయం ప్రతిష్టాత్మకమైన “రెండో అంతర్జాతీయ సదస్సు ఎపిక్ -2025” ప్రారంభ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ సిహెచ్ సతీష్ కుమార్ తొలిరోజు ప్రారంభోపన్యాసం చేశారు. ముఖ్యఅతిథి ఆవుల చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్-ఫోటోనిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు (ఎపిక్) అంటే ఎలక్ట్రానిక్ భాగాలను, ఫోటోనిక్ (కాంతి) భాగాలను ఒకే మైక్రోచిప్‌లో ఏకీకృతం చేసే సాంకేతికత అని వివరించారు. ఇవి డేటాను ప్రాసెస్ చేయడానికి ఎలక్ట్రాన్‌లతో పాటు ఫోటాన్‌లను (కాంతి కణాలను) ఉపయోగిస్తాయన్నారు. సాంప్రదాయ ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌ల కంటే ఎక్కువ వేగంగా, తక్కువ శక్తితో పనిచేయడానికి సహాయపడతాయన్నారు. ఈ సర్క్యూట్లు వాతావరణం వంటి కఠినమైన పరిస్థితులలో పనిచేయడానికి కూడా రూపొందించబడ్డాయన్నారు. మిశ్రమ సాంకేతికత ముఖ్య లక్షణమన్నారు. ఈ సర్క్యూట్లు ఎలక్ట్రానిక్ (ట్రాన్సిస్టర్‌లు, రెసిస్టర్‌లు), ఫోటోనిక్ (లైట్-ఎమిటింగ్, డిటెక్టింగ్, ట్రాన్స్‌మిటింగ్ భాగాలు) భాగాలను కలిగి ఉంటాయన్నారు. ఫోటాన్‌లు ఎలక్ట్రాన్‌ల కంటే వేగంగా ప్రయాణిస్తాయి, కాబట్టి డేటా ప్రాసెసింగ్ వేగంగా ఉంటుందన్నారు. ఫోటాన్‌లు ప్రయాణించేటప్పుడు ఎటువంటి శక్తిని వినియోగించుకోవని, వేడిని ఉత్పత్తి చేయవని వెల్లడించారు. వీటిని ఎలక్ట్రానిక్, ఫోటానిక్ భాగాలు కలిసే అనేక రంగాలలో ఉపయోగిస్తారని చెప్పారు. ముఖ్యంగా అంతరిక్షంలో కఠినమైన వాతావరణంలో పనిచేసే పరికరాల కోసం వాడతారని ఆవుల చంద్రశేఖర్ వివరించారు. ఈ సందర్భంగా అబ్ స్ట్రాక్ట్ బుక్ ను విడుదల చేశారు. ఉపకులపతి ప్రొఫెసర్ సిహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన ఫలితాలను, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని, సృజనాత్మకతను పంచుకునేందుకే ప్రపంచ స్థాయి వేదికగా ఈ సదస్సు నిలుస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో చర్చించి మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ సివి టోనీ, కన్వీనర్ డాక్టర్ గౌతమ్ కుమార్ రానా, ఈసిఈ విభాగాధిపతి డాక్టర్ కె.ఏ. సునీత, తదితరులు పాల్గొన్నారు.









