డిప్లొమాతో దృఢమైన పునాది : సి.ఎఫ్.ఐ. రాష్ట్ర ఉపాధ్యక్షులు డా ఎన్. విశ్వనాథ్ రెడ్డి

– ఐఈఎస్‌లో ఆల్ ఇండియా 75వ ర్యాంక్ సాధించిన దాసరి ఇందుమతికి ఘన సత్కారం

తిరుపతి, డిసెంబర్ 23, జనస్వరం : భారత ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) పరీక్షలో ఆల్ ఇండియా 75వ ర్యాంక్ సాధించిన తిరుపతికి చెందిన ప్రతిభావంతురాలు దాసరి ఇందుమతిని, ఆమె తల్లి మాధవిని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్. విశ్వనాథ్ రెడ్డి, శ్రీ కపిలేశ్వరస్వామి హైస్కూల్ హెడ్‌మాస్టర్, ఇందుమతి గైడ్ టీచర్ కె. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జ్ఞాపికను అందచేసి ఘనంగా సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమంలో విశ్వం స్కూల్స్ అకాడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి, టీటీడీ ఉద్యోగి కుమారస్వామి, విద్యావేత్తలు, ప్రముఖులు పాల్గొని ఇందుమతిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డా. ఎన్. విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఇందుమతి సాధించిన విజయం విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 10వ తరగతి అనంతరం డిప్లొమా విద్యను ఎంపిక చేసుకోవడం ద్వారా ఇందుమతి సాంకేతిక విషయాల్లో బలమైన పునాది, ప్రాయోగిక అవగాహన, క్రమశిక్షణతో కూడిన అధ్యయన శైలిని అలవరుచుకున్నారని తెలిపారు. డిప్లొమా ద్వారా పొందిన లోతైన జ్ఞానం ఆమె ఇంజినీరింగ్ విద్యలోనూ, అనంతరం ఐఈఎస్ వంటి అత్యంత కఠినమైన జాతీయ స్థాయి పోటీ పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించడంలో కీలక పాత్ర పోషించిందని వివరించారు. ఈ సందర్భంగా శ్రీకపిలేశ్వరస్వామి హైస్కూల్ హెడ్‌మాస్టర్, ఇందుమతి గైడ్ టీచర్ కె. కృష్ణమూర్తి మాట్లాడుతూ, “ప్రతి విద్యార్థి సరైన జ్ఞానం, క్రమశిక్షణ, మరియు లక్ష్యంపై నిబద్ధత కలిగి ఉంటే, ఇందుమతి సాధించినట్లే జాతీయ స్థాయి ర్యాంకులు సాధించడం సాధ్యమే. చిన్ననాటి నుంచే ఇందుమతిలో కనిపించిన క్రమశిక్షణే ఈ విజయానికి ప్రధాన కారణం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇందుమతికి అభినందనలు తెలిపారు.

See also  నెల్లూరు సిటీలో జనసేన జెండా ఆవిష్కరణ