సీఈసీ జ్ఞానేష్ కుమార్ వైదొలగాలి

– వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి న్యాయవాది పేరూరు కురుబ నాగిరెడ్డి

అనంతపురం, అక్టోబర్ 6, జనస్వరం : భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తన పదవి నుంచి వైదొలగాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, న్యాయవాది పేరూరు కురుబ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా కల్పించిన స్వతంత్ర హోదా కలిగిన ఎన్నికల కమిషన్ తన ఉనికి, ప్రభావాన్ని కోల్పోయే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. గతంలో పలువురు ఎన్నికల కమిషనర్లు నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సజావుగా నిర్వహించిన ఘనత ఉందన్నారు.

అయితే ఇటీవల కాలంలో కొందరు ఎన్నికల కమిషనర్లు కేంద్ర ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని నాగిరెడ్డి అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈవీఎంల పనితీరు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో ఓటర్ల జాబితాలో జరుగుతున్న మార్పులు, ఓటర్ల తొలగింపు వంటి అంశాలపై ఎన్నికల కమిషన్ సమగ్ర వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఈసీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకోవడం దారుణమని విమర్శించారు. గతంలో కేరళలో రహదారి నిర్మాణానికి సంబంధించిన అవినీతి ఆరోపణల్లో జ్ఞానేష్ కుమార్ పేరు ప్రస్తావనకు రావడం, ఆయనపై విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతున్నట్లు వార్తలు రావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా కొనసాగడంపై దేశవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఈ నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి వైదొలగాలని పేరూరు కురుబ నాగిరెడ్డి డిమాండ్ చేశారు.

See also  రూ. 25000ల సొంత ఖర్చులతో పాఠశాలలో శ్రమదానం చేసిన జనసేన నాయకులు లాయర్ జయరాం రెడ్డి, అభినందించిన స్కూలు సిబ్బంది మరియు విద్యార్థులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి