
అనంతపురం, నవంబర్ 14 (జనస్వరం): స్థానిక ఎంఎస్ఎస్ఎస్ కార్యాలయంలో జిల్లా మహిళా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు మన్నల సుబ్రమణ్యం అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సాకే రామతీర్థ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్లాడుతూ జిల్లాలోని రాప్తాడులో జరిగిన సంఘటన అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళా చైర్‌పర్సన్‌తో పాటు జిల్లా స్థాయిలో మహిళా సభ్యులు ఉన్నప్పటికీ, మహిళలు, బాలికలపై రోజురోజుకూ అఘాయిత్యాలు జరుగుతుండటం ఆందోళనకరమన్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు అమలు చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు త్వరితగతిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన గుంతకల్లు పద్మ మాట్లాడుతూ, జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, 31 మండలాల్లో మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలు, దౌర్జన్యాలను అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేద మహిళకు అందేలా కృషి చేస్తానన్నారు. తన శక్తి మేరకు మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు. పేద మహిళలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం, సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.








