
– 15 రాష్ట్రాల నుంచి 300 మంది క్రీడాకారుల పాల్గొనడం విశేషం
నంద్యాల, జూన్ 8 (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ కర్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 4వ జాతీయ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు, 50 మంది అధికారులు ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనడం విశేషం. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ నాయకుడు ఫయాజ్, ప్రముఖ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి, న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు, పార్టీ కార్యదర్శి సురేంద్ర రెడ్డి, జి. ప్రగతి రెడ్డి, కర్లింగ్ నిర్వాహకులు రహీం, మహమ్మద్ అకీబ్, వెంకటేశ్వరమ్మ, నిమ్మకాయల సుధాకర్, సుశాంత్ తదితరులు హాజరయ్యారు.
అతిథులు కర్లింగ్ ఆటను ఆడి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు యువతను శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఒకే వేదికపై పోటీపడటం భారత వైవిధ్యంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. నంద్యాల వేదికగా జాతీయ స్థాయి ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించడం గర్వకారణమని, ఈ పోటీలు యువ క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు గొప్ప అవకాశంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్న వారు, గ్రామీణ ప్రాంతాల యువత కూడా క్రీడల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు పొందగలరని అన్నారు. కర్లింగ్ వంటి వినూత్న క్రీడలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశం ప్రపంచ క్రీడారంగంలో మరింత గుర్తింపు సాధించగలదని అభిప్రాయపడ్డారు. రామకృష్ణ కళాశాల యాజమాన్యం తరఫున డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యువత సమగ్రాభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు, క్రీడాభిమానులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న బహుమతి ప్రదానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి క్రీడాభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.








