వైసీపీకి హిందుత్వ వ్యతిరేక ముద్ర

  • పాపం వెంటాడుతున్న రాజకీయాలు!

రాజకీయాల్లో కొన్ని తప్పిదాలు ఒక్కసారి జరిగిపోయిన తర్వాత వదిలిపెట్టినా, వాటి నీడ మాత్రం చాలా దూరం వరకు వెంబడిస్తుంది. వైసీపీకి ఇప్పుడు అదే పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు చిన్నచిన్న సంఘటనలని నిర్లక్ష్యం చేసినా, వాటి ప్రతిధ్వనులు ఇప్పుడు పెద్ద రాజకీయ భారం అయ్యి వైసీపీని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థాల ఘటనలు, తిరుమల లడ్డు వివాదం.. ఇవన్నీ కలిపి వైసీపీకి హిందుత్వ వ్యతిరేక ముద్ర వేసేశాయి.

అధికారంలోని నిర్లక్ష్యం – భవిష్యత్తులో శాపం :

అధికార పార్టీగా ఉన్నప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఘటనను లైట్‌గా తీసుకున్నారు. అంతర్వేది రథం దగ్ధం అయింది, రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం అయింది, రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో దాడులు జరిగాయి. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు, భక్తులు బాధపడ్డారు, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం “దర్యాప్తు జరుగుతోంది” అనే ఒక్క మాటతో తేలిగ్గా వదిలేసింది. విగ్రహం పగిలితే ‘‘కొత్తది పెడతాం’’, రథం కాలిపోతే ‘‘కొత్తది తెప్పిస్తాం’’ అంటూ అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వంటి మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో వైసీపీ పట్ల విరక్తి పెంచాయి. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన చోట, వైసీపీ నేతలు రాజకీయంగా విపక్షాలపై నిందలు వేయటానికే పరిమితమయ్యారు.

రామతీర్థం ఘటన – ధర్మానికీ దెబ్బ :

విజయనగరం జిల్లా రామతీర్థాల్లో జరిగిన విగ్రహ ధ్వంసం ఘటన ప్రజలలో ఆవేదన రేపింది. రాంపాలతో కోసిన ఆనవాళ్లు ఉన్నా, నిందితులను పట్టుకోలేకపోయిన వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. పోలీసులు కూడా ఇది విధ్వంస చర్య అని ధృవీకరించగా, ప్రభుత్వం మాత్రం కేసును మరుగున పడేసింది. అప్పట్లో టిడిపి నేతలే నిందితులని చెప్పినప్పటికీ, ఆధారాలు చూపించలేకపోయారు. చివరికి ఆ ఘటనను ప్రజలు ‘‘హిందుత్వంపై దాడి’’గా గుర్తుంచుకున్నారు. అదే వైసీపీ పట్ల ప్రజాభావాన్ని మార్చేసింది.

అంతర్వేది రథం అగ్నిప్రమాదం – ‘దర్యాప్తు’ పేరిట మూల్యం చెల్లించిన పార్టీ :

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ప్రజలు దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం దర్యాప్తు పేరుతో కాలం గడిపింది. ‘‘కొత్త రథం నిర్మిస్తాం కదా’’ అనే నిర్లక్ష్య వ్యాఖ్యతో మంత్రులు దానిని తేలిగ్గా తీసుకున్నారు. ఆ రోజు నుంచి వైసీపీ ‘‘హిందూ వ్యతిరేక పార్టీ’’ అనే ముద్ర నుండి బయటపడలేకపోతోంది.

తిరుమల లడ్డు వివాదం.. భక్తి మధ్యలో రాజకీయాల మిశ్రమం :

See also  ఉద్దానంపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవి అన్నీ ఉత్తుత్తి మాటలే!

తాజాగా తిరుమలలో లడ్డు తయారీపై వెలుగుచూసిన అవకతవకలు వైసీపీకి కొత్త ఇబ్బందులు తెచ్చాయి. టీటీడీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి అనుచరుడు అప్పన్న లడ్డు సప్లై కాంట్రాక్ట్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని సీటు గుర్తించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించిందని సమాచారం. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉంది. ‘‘తిరుమల లడ్డూనే కలుషితం చేసిన పార్టీ’’ అనే ప్రచారంతో వైసీపీ భక్తుల మనసుల్లో మరింత దూరమవుతోంది.

జగన్‌పై నిలిచిన అనుమానాలు :

వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా క్రైస్తవ మతస్థుడనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన ప్రధానిగా ఉన్న రాష్ట్రంలో హిందూ ధర్మస్థలాలపై వరుస దాడులు జరగడం, వాటిపై చర్యలు తీసుకోకపోవడం — ప్రజల్లో ‘‘జగన్ హిందుత్వ వ్యతిరేకి’’ అనే భావనను బలపరిచింది. భక్తుల మనసుల్లో పుడిన ఈ అనుమానం ఇప్పుడు రాజకీయ బలంగా మారుతోంది. 2029 ఎన్నికలకు వైసీపీ వెళ్లేటప్పుడు, బీజేపీ–టీడీపీ–జనసేన కూటమి ఈ హిందుత్వ ముద్రను మరింతగా వినియోగించుకునే అవకాశముంది.

జగన్ రీ-ఇంట్రడక్షన్ ప్లాన్ – హిందుత్వమే అడ్డంకి :

జగన్ రెడ్డి 2026లో ప్లీనరీ, 2027లో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. “ప్రజల్లోకి మళ్లీ వెళ్లాలి” అన్న ఆయన సంకల్పానికి హిందుత్వం అడ్డుగా నిలవొచ్చు. ఎందుకంటే 2019 తర్వాత హిందూ సమాజం వైసీపీ పట్ల దూరమవడం ప్రారంభించింది. ఆ భావనను మార్చడం అంత ఈజీ కాదు. హిందూ వర్గాల మనసు గెలుచుకోవాలంటే భక్తి, విశ్వాసం పట్ల గౌరవం చూపాలి. కానీ వైసీపీ శైలి మాత్రం ఇప్పటికీ ‘‘దేవాలయాలు నిర్మిస్తాం – అంతే!’’ అనే తీరులోనే ఉంది.

హిందుత్వం – రాజకీయ శక్తి, వైసీపీకి రాజకీయ సవాలు :

ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందుత్వం ఓ బలమైన రాజకీయ శక్తిగా మారింది. బీజేపీని ఎదుర్కోవాలంటే హిందూ విశ్వాసాల పట్ల గౌరవం తప్పనిసరి. కానీ వైసీపీ గత ఆరు సంవత్సరాల పాలనలో ఆ విశ్వాసం కోల్పోయింది. దేవాలయ దాడులపై మౌనం, భక్తుల ప్రశ్నలకు నిర్లక్ష్యం, టీటీడీ వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు — ఇవన్నీ కలిపి వైసీపీకి ‘హిందుత్వ వ్యతిరేక ముద్ర’ని మరింత గాఢం చేశాయి.

ముగింపు :

రాజకీయాలు మారుతాయి, నాయకులు మారతారు, కానీ భక్తి మారదు. హిందువుల మనసులో దేవుడిపై గౌరవం ఉన్నంతవరకు, ఆ విశ్వాసంపై దెబ్బ కొట్టిన వారిని వారు ఎప్పుడూ క్షమించరు. వైసీపీ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అంతర్వేది రథం నుండి రామతీర్థాల విగ్రహం వరకు, తిరుమల లడ్డు నుండి అవినీతి వరకు అన్నీ ఒకటే సూత్రం చెబుతున్నాయి.

See also  హైదరాబాద్‌లో కూర్చొని.. ఏపీ రాజకీయాలు!

‘‘దేవాలయాలను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం దేవుడి దయ కోల్పోతుంది, ప్రజల దయ కూడా’’

వచ్చే ఎన్నికల్లో ఈ హిందుత్వ వ్యతిరేక ముద్ర వైసీపీకి ఎంత భారం అవుతుందో, ప్రజల తీర్పే చెబుతుంది.

 

జమ్ము సాయి కల్యాణ్,

పొలిటికల్ అనలిస్టు,

మేనేజింగ్ డైరెక్టర్,

జనస్వరం మీడియా.