వైసీపీ డైవర్ట్ రాజకీయాలు బట్టబయలు అయ్యాయి : జనసేన నాయకులు జగదీష్

పిఠాపురం, ఫిబ్రవరి 02, (జనస్వరం) : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో వైసీపీ నేతలు పూర్తిగా ఇరుక్కోవడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఉద్దేశపూర్వకంగా కులాల మధ్య చిచ్చు రాజేసే దిగజారిన రాజకీయానికి తెరలేపుతున్నారని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అవమానించే స్థాయిలో ఉన్నాయని ఖండించారు. ఇవి రాజకీయ విమర్శలు కాదని, పూర్తిగా వ్యక్తిగత దూషణలుగా మారాయని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పాలన వైఫల్యానికి ప్రతీకగా మారిందని, ఈ కల్తీ నెయ్యి పాపం నుంచి తప్పించుకునేందుకే వైసీపీ నేతలు సెల్ఫ్ డిఫెన్స్‌లో పడిపోయి నీచమైన డైవర్ట్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కులాల మధ్య చీల్చి రాజకీయ లబ్ధి పొందాలనే దుర్బుద్ధి వైసీపీకి మాత్రమే సొంతమని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై, ఆయన కుటుంబ సభ్యులపై పరుష పదజాలంతో దూషించడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, రాష్ట్ర ప్రజల గౌరవాన్ని అవమానించినట్లేనని పెంకే జగదీష్ పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై పోలీసులు వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ వ్యాఖ్యల వెనుక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మౌన సమ్మతి ఉందని ఆరోపిస్తూ, గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన దూషణల సమయంలో మాజీ ఎంపీ వంగాగీత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు లాంటి నేతలు మౌనం పాటించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు నోరు తెరవని కుల నాయకులు ఇప్పుడు నీతి బోధలు చెప్పడం విడ్డూరమని ప్రశ్నించారు. జనసేన పార్టీ ఒక కులానికి లేదా ఒక కుటుంబానికి చెందిన పార్టీ కాదని, రాష్ట్ర ప్రజల గౌరవం, విలువల కోసం పోరాడే పార్టీ అని స్పష్టం చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో ఎక్కడైనా శాంతిభద్రతలకు భంగం కలిగితే దానికి పూర్తి బాధ్యత అంబటి రాంబాబు, జోగి రమేష్‌తో పాటు వైసీపీ నాయకత్వానిదేనని హెచ్చరించారు. ఈ తరహా వ్యాఖ్యలు కొనసాగితే జనసేన నాయకులు, కూటమి పార్టీ కార్యకర్తలు మౌనంగా ఉండరని తెలిపారు. చివరిగా అంబటి రాంబాబు, జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి వెంటనే తమ వ్యాఖ్యలకు బేషరతుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు పెంకే జగదీష్ తెలిపారు.

See also  మెగా యూత్ ఫోర్స్ రాయలసీమ కన్వీనర్‌గా పి. చక్రవర్తి నియామకం