మాన్యువల్ స్కావెంజింగ్‌కు స్వస్తి పలుకుతాం: మంత్రి నారాయణ

– సఫాయి కార్మికులకు యంత్రాలే భరోసా

– రూ.2.10 కోట్ల రుణాలతో కొనుగోలు చేసిన ఆరు వాహనాలను ప్రారంభించిన మంత్రి

నెల్లూరు, జూలై 24 (జనస్వరం): సఫాయి కార్మికుల ఆర్థిక స్వావలంబన, పరిశుభ్రత వ్యవస్థ ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలో జాతీయ సఫాయి ఖర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ రుణాలతో కొనుగోలు చేసిన నాలుగు నాలా క్లీనింగ్ యంత్రాలు, రెండు 12 టన్నుల ట్రిప్పర్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నాలా క్లీనింగ్ యంత్రాన్ని స్వయంగా నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో జాతీయ సఫాయి ఖర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 22 మంది లబ్ధిదారులకు రూ.2.10 కోట్ల సబ్సిడీ రుణాలు అందించామని తెలిపారు. ఆ రుణాలతో రూ.1.10 కోట్ల విలువైన నాలుగు నాలా క్లీనింగ్ యంత్రాలు, రూ.1 కోటి విలువైన రెండు ట్రిప్పర్లను కొనుగోలు చేయడం అభినందనీయమన్నారు. ఈ వాహనాలను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అద్దెకు తీసుకోవడం వల్ల లబ్ధిదారులకు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం లభిస్తుందని, ఇది సంక్షేమంతో పాటు శాశ్వత ఉపాధికి దోహదపడే కార్యక్రమమని పేర్కొన్నారు. సఫాయి కార్మికులు నగర ఆరోగ్యాన్ని కాపాడే పరిశుభ్రత యోధులని కొనియాడిన మంత్రి, గతంలో చేతులతో నిర్వహించిన పనులను ఇప్పుడు యంత్రాల ద్వారా నిర్వహించడం వల్ల వారి భద్రత, ఆరోగ్యం, గౌరవం మరింత పెరుగుతాయని అన్నారు. మాన్యువల్ స్కావెంజింగ్‌కు పూర్తిగా స్వస్తి పలికి, సాంకేతికత ఆధారిత పరిశుభ్రత వ్యవస్థను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెత్త సేకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల ఎలక్ట్రిక్ ఆటోలను మంజూరు చేశారని, వాటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3 వేల కోట్ల నిధులను గత ప్రభుత్వం వినియోగించలేదని విమర్శించారు. పరిశుభ్రమైన నెల్లూరు నిర్మాణంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి బీవీఎస్ పాఠశాలలో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని 8, 9 డివిజన్లలో రోడ్లు, కాలువల నిర్మాణ పనులను తనిఖీ చేసి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పర్యటనలో ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగిన మంత్రి, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి స్థానిక బజ్జీల బండి వద్ద సామాన్యుడిలా బజ్జీలు తిని అందరినీ ఆకట్టుకున్నారు. డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నగరాభివృద్ధి, పేదల సంక్షేమానికి మంత్రి నారాయణ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం రూ.6 కోట్లతో 10 వేల సైకిళ్లు కొనుగోలు చేశారని, తొలి విడతగా ఈ నెల 27న 7 వేల సైకిళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ రేష్మా, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ, మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి, నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు, కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, టీడీపీ నాయకులు కిన్నెర సాగర్, బాలాజీ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

See also  జగన్.. నీ భాగోతాలన్నీ బయటపెడతాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి