
అనంతపురము, ఏప్రిల్ 18, (జనస్వరం) : మానవాళికి ఎంతో అమూల్యమైన జలసిరులను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని ప్రముఖ ఆర్థికవేత్త, రాయలసీమ ప్రజాసమాఖ్య అధ్యక్షులు, హెడ్మాష్టర్ గొర్తి వెంకటస్వామి పిలుపునిచ్చారు. కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రాంగణం, గ్రామపంచాయతీ పరిధిలో శనివారం “స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతినెల మూడో శనివారం చేపట్టే ఈ కార్యక్రమాన్ని “జలధార – జలహారతి” థీమ్ తో నీటి ఆవశ్యకతను వివరించేందుకు ప్రభుత్వం ఎంచుకుందని వెంకట్ అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సురేష్ కృష్ణ, వెల్ఫేర్ అసిస్టెంట్ తనూజ, కంప్యూటర్ ఆపరేటర్ మహేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ‘స్వచ్ఛాంద్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక స్వచ్ఛత, నీటి సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని హెడ్మాష్టర్ గొర్తి వెంకట్ అన్నారు. పారిశుధ్యం, అవగాహన కోసం శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పంచాయతీ అధికారులు సమన్వయంతో పాల్గొనడంతో మెరుగైన ఫలితాలు సాధ్యమన్నారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన ముఖ్య కార్యక్రమాల్లో.. వర్షపు నీటి సంరక్షణపై అవగాహన, చర్యలు, చెరువులు, కుంటలు శుభ్రపరచడం, రక్షణ, ఇంకుడుగుంతలు నిర్మాణం, డ్రైనేజీ నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, నీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల అమలు వంటివి నిర్వహించామన్నారు. ఈ అంశాలపై గ్రామాల్లో విస్తతంగా కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రజల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. చేపట్టిన పనులను ఎస్‌ఎఎస్‌ఎ యాప్‌లో నమోదు చేయడం, కార్యక్రమాన్ని ప్రచారాత్మకంగా నిర్వహించడం వంటి చర్యలు చేపట్టామన్నారు. జిల్లా పంచాయతీ అధికారులు ముఖ్య కార్యనిర్వాహక అధికారులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం మెరుగుపడి పర్యావరణ పరిరక్షణకు దోహదం అవుతుందని గొర్తి వెంకట్ వెల్లడించారు.








