
తిరుపతి, నవంబర్ 13, (జనస్వరం) : తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో ఆధునిక సౌకర్యాన్ని అందించేందుకు ముందుకువచ్చింది. ఆధునిక టెక్నాలజీని వినియోగించి భక్తులకు సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా చేరేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది.
టీటీడీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో కలిసి ఈ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేస్తోంది. దర్శన టికెట్లు, వసతి గదులు, విరాళాలు, లడ్డూ బుకింగ్స్‌తో పాటు సేవా కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో అందించే విధంగా ఈ చాట్‌బాట్ ఉండనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌలభ్యం కోసం ఈ సేవలను 13 భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇవ్వడంతో పాటు, ఫిర్యాదులు, సూచనలను కూడా చాట్‌బాట్ ద్వారా టీటీడీకి నేరుగా పంపే అవకాశం కల్పించనున్నారు.
ఈ చాట్‌బాట్‌లో స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ వంటి సదుపాయాలు ఉండనున్నాయి. వాయిస్ కమాండ్ల ద్వారా కూడా సమాచారం పొందే అవకాశం ఉండటంతో భక్తులకు మరింత సౌలభ్యం కలగనుంది.
ఈ ఆధునిక చాట్‌బాట్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, ఎస్వీబీసీ ఛానల్ ప్రసారాల నాణ్యతను మెరుగుపర్చడంపై కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
చాట్‌బాట్ సేవలు ప్రారంభమైన తర్వాత దర్శనం, వసతి, విరాళాల వంటి ముఖ్య సమాచారం సులభంగా, వేగంగా చేరుతుండడంతో భక్తులకు భారీగా ఉపయోగం కలగనుందని టీటీడీ అధికారులు తెలిపారు.








