
కడియం, మార్చి 29 (జనస్వరం) : ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని కడియం మండల పరిషత్ అధ్యక్షుడు వెలుగుబంటి ప్రసాద్ అన్నారు. కడియం బొబ్బిలి బ్రిడ్జి సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడియం మండల టీడీపీ అధ్యక్షుడు వెలుగుబంటి నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ దేశంలో ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. కిలోకు రెండు రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. నిరుపేదలకు అర్హత ఆధారంగా రూ.4 వేల నుండి రూ.14 వేల వరకు పెన్షన్లు అందిస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీదేనని పేర్కొన్నారు. అలాంటి పసుపు జెండాను మోయడం ప్రతి నాయకుడు, కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు ఉప్పులూరు సదానందం, వనం సూరిబాబు, హాస్పిటల్ కమిటీ సభ్యుడు చిలుకూరు ప్రభాకర్, ఉప్పులూరు నాని, గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షుడు గుత్తుల కిషోర్, జల్ది కుప్పారావు, పాక మంగయ్య, కనికెళ్ళ బుల్లియ్య, తోట శీను, గుడిగంట పోసుబాబు, గావు రామాంజి తదితరులు పాల్గొన్నారు.








