స్థానిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి : సాకే రామతీర్థ

అనంతపురం, ఏప్రిల్ 29 (జనస్వరం) : స్థానిక ఉపాధ్యాయ భవనంలో నిర్వహించిన స్థానిక సమస్యలపై సమావేశానికి మాదిగ సంక్షేమ సేవా సంఘం (MSSS) వ్యవస్థాపక అధ్యక్షుడు సాకే రామతీర్థ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం అత్యవసరమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు విలువైన విద్యను అందించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యపై అధిక భారం మోపకూడదని సూచించారు. అధిక ఫీజుల భారం కారణంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతూ తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వైద్య సేవలు పేదలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది, పరికరాలు సమృద్ధిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిజేరియన్ ప్రసవాలు పెరుగుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అనవసర వైద్య విధానాలను నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకువచ్చి దళారి వ్యవస్థను నిర్మూలించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు అందించడంతో పాటు ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. మాదిగల ఆలయ ప్రవేశానికి అడ్డంకులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్మశానవాటికల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మన్నల సుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడు ఎక్కలూరి నాగరాజు, సంయుక్త కార్యదర్శి ఓబయ్య, కోశాధికారి శంకరయ్య, మల్లికార్జున, నెట్టెప్ప, మాలింగ, ప్రవీణ్ కుమార్, మల్లేష్ తదితరులు, వివిధ మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  శింగనమల కేజీబీవీకి సరుకులు అందిస్తున్న ఏజెన్సీని రద్దు చేయాలి