మహనీయుల ఆశయాలే నేటి యువతకు మార్గదర్శకం: డా. ఒమ్మి రఘురామ్

– ఘనంగా బాల గంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు

కిర్లంపూడి, జూలై 23 (జనస్వరం): జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల్లో భారత స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకులు లోకమాన్య బాల గంగాధర్ తిలక్, అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థల అధినేత డా. ఒమ్మి రఘురామ్ ముఖ్య అతిథిగా పాల్గొని, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహనీయుల ఆశయాలే నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు. బాల గంగాధర్ తిలక్ స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని నింపిన మహానాయకుడని, “స్వరాజ్యం నా జన్మహక్కు” అనే ఆయన నినాదం కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిందన్నారు. అలాగే అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ అసమాన ధైర్యసాహసాలకు ప్రతీక అని, దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహోన్నత విప్లవకారుడని కొనియాడారు. నేటి విద్యార్థులు ఈ మహనీయుల దేశభక్తి, క్రమశిక్షణ, త్యాగనిరతి, ధైర్యం, విలువలను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించగా, అధ్యాపకులు మహనీయుల జీవిత విశేషాలను వివరించారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు.

See also  కాకరాపల్లి థర్మల్ మృతులకు టెక్కలి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు