హెర్బల్ పార్కుతో రోగులకు ఉల్లాసం : సిఈఓ ఆవుల చంద్రశేఖర్ వెల్లడి

నెల్లూరు, ఫిబ్రవరి 5, జనస్వరం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మానసిక ఉల్లాసం కోసం హెర్బల్ పార్కుల ఏర్పాటుకు కృషిచేస్తున్నట్లు ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ) ఆవుల చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సత్యకుమార్, ముఖ్య కార్యదర్శి సౌరబ్ గౌర్ ఈ మేరకు నిర్ణయించారని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, తొలిదశలో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో హెర్బల్ పార్కుల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, వైద్య కళాశాలను బోర్డు సిఈఓ చంద్రశేఖర్ మంగళవారం ప్రత్యేకంగా సందర్శించారు. వాటి ప్రాంగణంలో మొక్కల పెంపకానికి అనువైన స్థలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఈఓ వెంట ఉప సిఈఓ ప్రదీప్, నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కొండేటి మాధవి, ప్రిన్సిపాల్ డా. రాజేశ్వరి, ఉద్యానవనాధికారి సాయి, తదితరులున్నారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ, ఆసుపత్రి ప్రాంగణంలో హెర్బల్ పార్కుతో పాటు, వాకింగ్ ట్రాక్, సీటింగ్ బెంచీలు, పూల మొక్కలు, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి, రోగులకు మానసిక ఆనందం పెంపొందిస్తామని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు, పారిశ్రామికవేత్తలు, దాతలు, స్వచ్ఛంద సంస్థల మద్దతు తీసుకుంటామన్నారు. హెర్బల్ పార్కుల ఏర్పాటుకు దాతలు దత్తత తీసుకోవచ్చని, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు కేటాయించవచ్చని తెలిపారు.
విలువైన ఔషధ మొక్కల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం అందిస్తున్నాయని ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు సిఈఓ ఆవుల చంద్రశేఖర్ అన్నారు. జాతీయ ఔషధ మొక్కల బోర్డు ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద ఔషధ, సుగంధ మొక్కల సాగు, వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. అశ్వగంధ, వేప, తులసి వంటి మొక్కల సంరక్షణకు ఆర్థిక సహాయం అందిస్తాయన్నారు. స్థానిక ఆసుపత్రులు, ఆయుర్వేద కేంద్రాలు ఈ మూలికలను ప్రాథమిక చికిత్స కోసం వాడుతున్నాయన్నారు. అలాగే సుగంధి పాల వంటి మొక్కలు వ్యాధి నివారణకు ఉపయోగపడతాయన్నారు. ఔషధ, సుగంధ మొక్కల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. జాతీయ ఔషధ మొక్కల బోర్డును 2000 సం.లో స్థాపించారని, ఈ సంస్థ, ఔషధ మొక్కల సాగు, సంరక్షణ, ఎగుమతులను ప్రోత్సహిస్తుందని వివరించారు.
ప్రధానంగా ఔషధ మొక్కలు వేప, అశ్వగంధ, పునర్నవ, తులసి వంటివి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయన్నారు. సుగంధ మొక్కలు లెమన్‌గ్రాస్, రోజ్ పెటల్స్, సుగంధ పాల వంటివి సుగంధ తైలాల కోసం, చర్మ సంరక్షణకు (సుగంధి ఉటానే పౌడర్) వాడతారని వివరించారు. ఆసుపత్రి చికిత్సలో కూడా వీటి ఉపయోగాలున్నాయన్నారు. ఆయుర్వేద, సిద్ధ, యోగా కేంద్రాలలో ఇవి మందులుగా, చలువ చేసే పదార్థాలుగా, యాంటీ బాక్టీరియల్ మందులుగా వాడతారని తెలిపారు. సాగు మార్గదర్శకాలకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ ఈ మొక్కల నాణ్యమైన సాగుపై సాంకేతికతను అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు కూడా ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహిస్తోందని సిఈఓ ఆవుల చంద్రశేఖర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అధికారులు, పలువురు వైద్యులు, విశ్రాంత ప్రొఫెసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

See also  ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ - ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్