
– సిఈఓను సత్కరించిన మంత్రి సత్యకుమార్, ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్
విజయవాడ, జూలై 03, జనస్వరం : ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు (ఏపీఎంఏపీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ), రాష్ట్ర అటవీశాఖ సీనియర్ అధికారి ఆవుల చంద్రశేఖర్ అంతర్జాతీయ అవార్డు అందుకోవడం అభినందనీయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. లండన్ నగరంలోని బ్రిటన్ పార్లమెంట్ హాల్ లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి అంతర్జాతీయ అవార్డును ఇటీవల అందుకున్న ఆవుల చంద్రశేఖర్ శుక్రవారం సచివాలయంలోని సమావేశ మందిరంలో మంత్రి సత్కరించారు. “భారతీయ ఆయుర్వేద శాస్త్రం – వ్యవసాయ సాంకేతికత” అనే ప్రధాన శీర్షికతో 50 పరిశోధనా గ్రంథాలను స్వల్పకాల వ్యవధిలో వెలువరించడం స్ఫూర్తిదాయకమన్నారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్” సంస్థ చంద్రశేఖర్ కృషిని గుర్తించి, అంతర్జాతీయ అవార్డు అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. “ది ఇండియన్ ఆయుర్వేద సైన్స్ & అగ్రి టెక్నాలజీ” అనే శీర్షికతో, 44 వ్యాధులకు సంబంధించిన 729 ఔషధ మొక్కలు, నివారణలతో కూడిన 50 పుస్తకాలను పూర్తి చేయడం ఒక ముఖ్యమైన రికార్డుగా ప్రశంసించారు. ఈ 50 పుస్తకాలన్నీ సహజ నివారణలు, వ్యవసాయ సాంకేతికత, మార్కెటింగ్, వర్గీకరణ, విలువ జోడింపు మొదలైనవాటిని శాస్త్రీయ పద్ధతిలో వివరిస్తాయని పేర్కొన్నారు. ఆవుల చంద్రశేఖర్ కృషికి అంతర్జాతీయ అవార్డు దక్కడం పట్ల వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐఏఎస్ అధికారులు చక్రధర్ బాబు రోణంకి గోపాలకృష్ణ తదితరుల ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఏపీ ఉప సీఈవో ప్రదీప్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
“ది ఇండియన్ ఆయుర్వేద సైన్స్ & అగ్రి టెక్నాలజీ” అనే శీర్షికతో ఆవుల చంద్రశేఖర్ రాసిన 50 పుస్తకాలలో మొక్కల వర్గీకరణ, మొక్కను గుర్తించడానికి, దాని స్థానాన్ని తెలుసుకోవడానికి జియో-ట్యాగింగ్, సాగు పద్ధతులు, అంతరపంటలు, మొక్కల రక్షణ, తెగుళ్ల నివారణ, పంటకోత పద్ధతులు, సాగు ఖర్చు, స్థూల, నికర ఆదాయం, ఔషధ ఉపయోగాలు, సంభావ్య దుష్ప్రభావాలు, వ్యాధి సూచనలు, దిగుబడి పరిరక్షణ పద్ధతులు, ధరలు ఇతర వివరాలు, మూలికా పరిశ్రమ వివరాలు, స్వరూపశాస్త్రం వంటి అంశాలపై సవివరమైన వివరణ కూడా ఉందని “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్” గుర్తించింది. ఔషధ మొక్కలు, వాటి భాగాలు, విలువ జోడించిన ఉత్పత్తుల వివరాలు, మొక్కల పరిశోధన వ్యాసాలు, వ్యాధి – పరిస్థితి అధ్యయనాలు, ముగింపులు వంటివి వున్నాయి. ఈ పుస్తకాలు ఉద్యానవన శాస్త్రం, వ్యవసాయం, వృక్షశాస్త్రం, బయో-టెక్నాలజీ, ఆయుర్వేదం మొదలైన వాటి విద్యార్థులకు, వైద్యులకు, ఫార్మా పరిశ్రమలకు, రైతులకు, అలాగే సాధారణ ప్రజలకు కూడా నివారణ సంరక్షణ కోసం, సాధారణ అనారోగ్యాల చికిత్స కోసం ఉపయోగపడతాయి.
పరిశోధనా గ్రంథాలివే :
ఆవుల చంద్రశేఖర్ వెలువరించిన పరిశోధనా గ్రంథాలలో పలు రకాల ప్రత్యేక వైద్య చికిత్సలకు సంబంధించిన కీలక వివరాలున్నాయి. ముఖ్యంగా కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, హెపటాలజీ, ఫల్మనాలజీ, గైనకాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, ఆంకాలజీ, బేరియాట్రిక్స్, ఓపియాలజీ, ఆర్కనాలజీ, రుమటాలజీ, మలేరియాలజీ, డయేరియా, హెమటాలజీ, ఎక్స్ క్రిటరీ సిస్టమ్, గ్యాస్ట్రో ఇంటెన్షనల్ సిస్టమ్, ఆప్తమాలజీ, ట్రికాలజీ, యూరాలజీ, ఓష్టియోలజీ, అడంటాలజీ, వంటి ప్రత్యేక వైద్య విభాగాల మీద అధ్యయనం సాగించారు. పలు రకాల వ్యాధులకు భారతీయ ఆయుర్వేద శాస్త్రంలోని విధానాలను వివరించారు. సంబంధిత ఔషధ మొక్కలను గుర్తించారు.
అంతర్జాతీయ అవార్డులు :
1. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికేట్, అంతర్జాతీయ అవార్డు, తేదీ.23-01-2026. “ది ఇండియన్ ఆయుర్వేద సైన్స్ అండ్ అగ్రి టెక్నాలజీ”. 15 సెప్టెంబర్, 2025 నుండి 16 డిసెంబర్, 2025 వరకు కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలో 468 ఔషధ మొక్కలతో కూడిన 33 పుస్తకాలను పూర్తి చేసినందుకు అవుల చంద్రశేఖర్‌కు ఈ పురస్కారం లభించింది.
2. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికేట్, అవార్డు, తేదీ.23-01-2026 “ది ఇండియన్ ఆయుర్వేద సైన్స్ అండ్ అగ్రి టెక్నాలజీ”. 468 ఔషధ మొక్కలు మరియు 17 వ్యాధులకు సహజ నివారణలుగా వాటి ఉపయోగాలను వివరించే 33 పుస్తకాలకు అవుల చంద్రశేఖర్ పేరు మీద ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ పుస్తకాలు వైద్యపరమైన ఉపయోగాలు, వ్యవసాయ – సాంకేతిక పద్ధతులకు కూడా ఉపయోగపడతాయి.
3. అమెరికన్ మెరిట్ కౌన్సిల్ సర్టిఫికేట్, అవార్డు, తేదీ.21-02-2026. “ది ఇండియన్ ఆయుర్వేద సైన్స్ అండ్ అగ్రి టెక్నాలజీ”. 31 మానవ వ్యాధులకు సహజ నివారణలుగా ఉపయోగపడే 533 ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలతో కూడిన 37 పుస్తకాల రంగంలో ఆవుల చంద్రశేఖర్ అవసరాలను విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు పొందారు.
4. అమెరికన్ మెరిట్ కౌన్సిల్ సర్టిఫికేట్, అవార్డు, తేదీ.21-02-2026. “భారతీయ ఆయుర్వేద శాస్త్రం మరియు వ్యవసాయ సాంకేతికత” ఆవుల చంద్రశేఖర్ 37 పుస్తకాల రంగంలో సామాజిక అవసరాలను విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు పొందారు. 533 ఔషధ మొక్కలతో కూడిన ఈ ప్రాజెక్ట్ 2025 సెప్టెంబర్ 15 నుండి 2025 డిసెంబర్ 16 వరకు కేవలం 3 నెలల స్వల్ప వ్యవధిలోనే పూర్తయింది.
5. సిఈఓ చంద్రశేఖర్ కృషికి మెచ్చి ప్రపంచ సంస్థలు ఏపీఎంఏపీకి అంతర్జాతీయ ప్రమాణ ధృవపత్రాలను ప్రదానం చేశాయి.
అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, పరిశోధన సంస్థ ద్వారా జారీ చేయబడిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, తేదీ.23-02-2026. ఏపీ ఔషధ, సుగంధ మొక్కల బోర్డును క్యూఆర్ఓ స్వతంత్రంగా మదింపు చేసింది. ఇది ఐఎస్ఓ 9001:2015, నాణ్యతా నిర్వహణ వ్యవస్థ యొక్క అవసరాలకు అనుగుణంగా ఉంది.
6. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, పరిశోధన సంస్థ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి 23 న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను జారీ చేశారు. ఏపీ ఔషధ, సుగంధ మొక్కల బోర్డును క్యూఆర్ఓ స్వతంత్రంగా మదింపు చేసింది. ఇది ఐఎస్ఓ 14001 : 2015, పర్యావరణ నిర్వహణ వ్యవస్థ యొక్క అవసరాలకు అనుగుణంగా వుందని గుర్తింపు దక్కింది.









