రైతుల ఆర్థిక ప్రయోజనాలే అజెండా  

– మొగలి పంటపై ఎపిఎంఎపిబి ప్రత్యేక అధ్యయనం 

– యూపీ, ఒరిస్సా రాష్ట్రాల్లో సీఈవో ఆవుల చంద్రశేఖర్ బృందం

అమరావతి, నవంబర్ 10, జనస్వరం : ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు (ఎపిఎంఎపిబి) రైతుల ఆర్థిక ప్రయోజనాలే అజెండాగా కసరత్తు ప్రారంభించింది. బోర్డు ముఖ్యకార్యనిర్వహణాధికారి (సిఈఓ) ఆవుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో సమన్వయ సమావేశాలను సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే రైతులకు అధిక ప్రయోజనం కల్పించేదిశగా మొగలి పంటపై ప్రత్యేక అధ్యయనం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలతో పాటు, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా సిఈఓ చంద్రశేఖర్ అధికారుల బృందంతో పర్యటనలు సాగిస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ లోని కనోజ్ ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 926 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీరానికి మూడు కిలోమీటర్ల వరకు ప్రథమశ్రేణి మొగలి పంట పండుతుందని అధికారులు గుర్తించారు. మొగలి అనేది సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా మొగలి నూనె కోసం పెంచే ఒక వాణిజ్య పంట. ఇది సాధారణంగా ఉద్యాన పంటలకు అంతర పంటగా, కంచెగా లేదా కొబ్బరి తోటల మధ్యలో కూడా పండిస్తారు. వరి పంట గట్టు చుట్టూ, రోడ్డుకు ఇరువైపులా, ఇళ్ల వద్ద కంచె లాగా, పశువుల కొట్టం వద్ద కూడా మొగలి వేస్తారు. బంజారు భూములు, కాలవ గట్ల వెంబడి వేయడంతో పాటు, ప్రత్యేకంగా సాగు కూడా చేస్తారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట, ఇచ్చాపురం, కవిటి, ఉద్దానం ప్రాంతం మొగలి పంటకు ప్రసిద్ధి. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, చీరాల, బాపట్ల కూడా అనువైన స్థలాలేనని గుర్తించారు. ఒరిస్సాలోని బరంపురం, గంజాం ప్రాంతంలో 15,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారని అధికారుల అధ్యయనంలో తేలింది. ఏడాదికి మూడు పంటలుగా జూన్ నుంచి అక్టోబర్ వరకు, డిసెంబర్ జనవరి నెలలో దిగుబడి ఉంటుంది. దీని నుంచి అనేక ప్రయోజనాలున్నాయి. మొగలి పూల నుండి లభించే నూనెకు అధిక డిమాండ్ ఉంది. దాని ధర లీటరుకు సుమారు రూ. 9 లక్షల వరకు ఉంటుంది. గత ఏడాది రూ. 19 లక్షల నుంచి రూ. 21 లక్షల వరకు పలికింది. వ్యవసాయ ఉత్పత్తులకు రక్షణగా కంచెలుగా కూడా ఉపయోగపడుతుంది. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం తెస్తుంది. కొబ్బరి తోటల మధ్య అంతర పంటగా సాగు చేస్తారు.
పొలాలకు రక్షణగా కంచెగా పెంచుతారు. మడ అడవుల్లాగా, తుఫానులు, ఈదురు గాలుల వంటి ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని తగ్గిస్తాయని, మొక్కలు దెబ్బతినకుండా వుంటాయని రైతులు చెబుతున్నారు. మొగలి పూలు 30 నుంచి 50 వరకు వస్తాయి. పూలతో పాటు ఆకులు కూడా అనేక రకాలుగా పనికొస్తాయి. సుగంధద్రవ్యాలుగా కిళ్లి, అత్తరు వంటి వాటిలో వాడతారు. సువాసన ఉత్పత్తికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రాంతం తనోజ్. అత్తరు లీటరు 40 వేల నుంచి 80000 దాకా ధర పలుకుతుంది. మొగలి జలం లీటర్ రూ. 5 వేల నుంచి రూ. 20 వేల వరకు మార్కెట్ లో విక్రయిస్తున్నారు. బరంపురం ప్రాంతంలో దీనికి సంబంధించిన చిన్న, మధ్య తరహా, పెద్ద పరిశ్రమలు 400 దాకా ఉన్నాయి.

See also  అరట్లకోట జనసేన పార్టీకి కంచుకోట

క్షేత్రస్థాయి పర్యటనలతో మెరుగైన ఫలితాలు : సిఈఓ ఆవుల చంద్రశేఖర్

ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన ఆర్ధిక ప్రయోజనం కల్పించే దిశగా తమ అధ్యయనం సాగుతోందని ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ) ఆవుల చంద్రశేఖర్ చెబుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనతో మిర్యాల ఫలితాలను సాధించవచ్చని వివరించారు. పరిశ్రమలను, పరిశోధనాశాలలను పరిశీలించామన్నారు. విజయవంతమైన నమూనాలతో, సూత్రాలతో ప్రయోగాత్మకంగా ముందుకు సాగుతామన్నారు. మొగలి పొదలు పెంచే రైతులకు అవసరమైన శిక్షణ, సలహాలు, సూచనలు అందజేస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో పంట భూముల రక్షణకు ఏర్పాటు చేసుకున్న మొగలి చెట్లు రైతులకు పెట్టుబడి లేని ఆదాయనాలుగా మారాయన్నారు. ఏడాదిలో ఆరు నెలలకు పైగా మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయని, పండుగలు, ఇతర సీజన్లలో ఒక్కొక్క పువ్వు రూ. 40 దాకా అమ్ముడుపోతాయని చెప్పారు. స్వల్ప వ్యవధిలో ఏపుగా పెరిగే మొక్కల కోసం ఒరిస్సా నుంచి నాణ్యమైన మొగలి అంట్లు అందుబాటులోకి తెస్తామన్నారు. రైతులకు ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటగా కూడా పనికి వస్తుందన్నారు. ఒక్కో చెట్టు ఏడాదిలో 800 నుంచి 1000 వరకు పూలు కాస్తుందని, వర్షాకాలంలోనే ఎక్కువగా దిగుబడి వస్తుందని చెప్పారు. ఏపీ లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా హెర్బల్ గార్డెన్స్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఎస్.వి ఆర్ట్స్ కళాశాల, అమరావతి సమీపంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, శ్రీకాకుళంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ విసి, రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్, ఇతర అధికారులను కలిసి చర్చించామన్నారు. యూనివర్సిటీ స్థాయిలో ప్రత్యేక కోర్సులను ప్రారంభించి విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. ఒరిస్సా పర్యటనలో కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ సువాసన, రుచి అభివృద్ధి సంస్థ (బరంపురం) డిప్యూటీ డైరెక్టర్ రామారావు, బృందం, శాస్త్రవేత్త పురుషోత్తం, రాజారత్నం, నాయక్, ఎపిఎంఎపి ఉప కార్యనిర్వహణాధికారి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.