పోలవరం నిర్మాణాన్ని పాలకులు ఇష్టారాజ్యంగా మార్చేశారు – శ్రీ పవన్ కళ్యాణ్ గారు

పోలవరం నిర్మాణాన్ని పాలకులు ఇష్టారాజ్యంగా మార్చేశారు – శ్రీ పవన్ కళ్యాణ్ గారు

           రాష్ట్ర విభజన అడ్డగోలుగా చేసిన పర్యవసానాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. కనీసం రాజధాని పెట్టుకుందామన్నా లుకలుకలుగా పరిస్థితి తయారయ్యిందన్నారు. పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో పేర్కొన్నది కాబట్టి బాధ్యత అని అన్నారు. ప్రాజెక్టు మొత్తం కేంద్రమే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంటే బాధ్యత మొత్తం కేంద్రం మీదే ఉండేదన్నారు. 

               రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగం తీసుకుందనీ, ప్రాజెక్టు నిర్మాణాన్ని కన్వీనియంట్ గా ఇష్టారాజ్యంగా మార్చేశారని అభిప్రాయపడ్డారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. సుధీర్ఘంగా సాగిన సమీక్షా సమావేశంలో జిల్లాల్లో స్థానిక సమస్యలను పార్టీ నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “పోలవరం ప్రాజెక్టు మీద స్పందించాలి అంటే నా ఒక్కడి ఆలోచన సరిపోదు. అందరితో మాట్లాడాలి… ఇరిగేషన్ రంగ నిపుణులు, సీనియర్ జర్నలిస్టులతో కూర్చుని విస్తృత స్థాయి సమావేశం జరగాలి. బలంగా ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ స్టాండ్ ఇది అని కేంద్రానికి నివేదిక ఇవ్వాలి. నేను వ్యక్తిగా మాత్రమే ఎమోషనల్ గా ఉంటానని, రాజకీయంగా మాత్రం ఎమోషనల్ గా ఉండను. ఎందుకంటే నేను ఒక నిర్ణయం తీసుకుంటే మాట వెనక్కి తీసుకోలేను.

ప్రజల మద్దతుతోనే పోరాటానికి బలం : 

               రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కాదు మూడు రాజధానులు అని ప్రకటించినప్పుడు అందరితో మాట్లాడి, సమావేశాలు నిర్వహించి అభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. పోలవరం వ్యవహారం గురించి మాట్లాడాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. తీరా రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేసిందని కేంద్రం అంటే నా దగ్గర సమాధానం లేకపోతే ఎలా? దీనిపై విస్తృత స్థాయిలో సమావేశాలు జరగాలి. ఏం తప్పులు జరిగాయో తెలుసుకోవాలి. ఆ తర్వాతే వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం. తీసుకువెళ్లబోయే ముందు కచ్చితంగా బాధ్యతగా చేద్దాం.

                 పోలవరం పర్యటనలో ఖమ్మం వరకు వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించాం. పునరావాసం ఎవరికీ అందలేదు. నిధుల్లో ఎక్కువ భాగం పునరావాసానికి వెళ్తుంది. గిరిజనుల జీవితాలు ఛిద్రం అయిపోయాయి. అయితే ప్రజల నుంచి కూడా మద్దతు వచ్చినప్పుడే పోరాటానికి బలం వస్తుంది. ఒక మాట మాట్లాడితే మిగిలిన వారిలా నేను తప్పించుకుని పారిపోలేను. ఎంత వరకు పోరాటం చేయగలను, ఎంత వరకు నిలబడగలను అనే అంశాలను పరిశీలించి మాట్లాడతాను. కేవలం ఉద్యమ స్థాయిలో మాట్లాడితే సరిపోదు. నాలో ఉద్యమ స్ఫూర్తి లేకపోతే నేను పార్టీ పెట్టను. సమాజమూలాల్లో మార్పు రావాలి అన్నదే నా లక్ష్యం. దాని కోసం పుట్టిన తపన నాది . నేను ఏదైనా చేస్తే వ్యవస్థాగతంగా మార్పులు జరగాలి. అందుకే చాలా బాధ్యతగా మాట్లాడతాను. ప్రతి విషయం మీద మాట్లాడడం మొదలుపెడితే దాని తీవ్రత పోతుంది. అమరావతి గురించి కూడా మొదటి రోజే నా స్పందన చెప్పలేదు. కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే నా గురించి మాట్లాడి, మన కార్యకర్తల మీద దాడి చేసినప్పుడు విషయం తెలిసిన మరుసటి రోజే అక్కడికి వెళ్లాను. నా స్పందన పరిస్థితి తీవ్రత ఆధారంగా ఉంటుంది. ప్రతి జిల్లాకి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించుకుని చర్చించి సమస్యలపై ముందుకు వెళ్దాం.

See also  భగత్ సింగ్ కాలనీ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన మనుక్రాంత్ రెడ్డి

కార్యకర్తల క్షేమం గురించి ఆలోచిస్తా : 

                     క్రియాశీలక సభ్యత్వం విషయానికి వస్తే – త్వరలో మొదలయ్యే సెకండ్ ఫేజ్ కార్యక్రమంలో  రాజోలు స్ఫూర్తితో ముందుకు వెళ్లండి. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే లేకపోయినా స్థానికంగా ఉన్న నాయకులంతా పని చేశారు. 500 వస్తే ఎక్కువ అనుకుంటే సంఖ్య దాదాపు 2 వేలు చేశారు. లెక్కలు వేయకుండా బూత్ స్థాయికి వెళ్లి పని చేయండి. సమీకరణాల విషయంలో ముందుగా  ఎలాంటి పరిమితులు విధించవద్దు. స్వచ్ఛందంగా వచ్చిన వారిని ముందు రానివ్వండి. తర్వాత ఫోకస్ పెట్టి పనిచేద్దాం. తొలి విడత 5 నియోజకవర్గాల్లో విజయవంతంగా జరిగింది. 2014లో క్రియాశీలక సభ్యత్వం పెట్టలేదు. ఉత్సాహంతో ఉరకలు వేసే వారు వస్తున్నప్పుడు వారిని ఆపదలుచుకోలేదు. ఒక అనుభవం తర్వాత ఎవ్వరు నిలబడతారు, ఎవ్వరు నిలబడలేరు అనేది గుర్తించాం. సాధారణ సభ్యత్వాన్ని ఆపం. పదవుల కంటే సమస్యల మీద పోరాడాలి అనుకునే వారికి సభ్యత్వం ఇవ్వాలి. ఎన్నికల్లో పరాజయం తర్వాత కోవిడ్ మహమ్మారి వచ్చేంత వరకు నిరంతరం పని చేసుకుంటూ ముందుకు వెళ్లాం. ఎక్కడా ఆగింది లేదు. పంచాయితీ ఎన్నికలు వచ్చే వరకు పని చేసుకుంటూనే వెళ్లాం. కోవిడ్ తో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలయిపోయిన పరిస్థితుల్లో మనకు తెలిసిన పెద్ద పెద్ద వ్యక్తులు చనిపోయిన పరిస్థితుల్లో ఓ పార్టీని నడిపే వ్యక్తిగా నాకు బాధ్యత ఉంది. నన్ను నమ్మి భావోద్వేగంతో యువకులు వచ్చేస్తారు. వారి జీవితాలను పార్టీ కార్యక్రమాలకు పణంగా పెట్టలేను. వారి ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే నేను బాధ్యత వహించాల్సి ఉంటుంది. గెలుపు కంటే మనకోసం పని చేసే వారు జెండా మోసే వారి ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యంగా భావిస్తాను. జెండా మోసిన వాళ్లు బాగుండాలి. వారి క్షేమం తర్వాతే పార్టీ గురించి ఆలోచిస్తాను. పార్టీ నాయకులు చెప్పిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విన్నాను. వాటిని ముందుకు తీసుకువెళ్లడం  ఎలా అనే అంశాలు రాసుకున్నాను. ప్రతి సలహా, సూచనను ముందు తీసుకువెళ్తాం” అని అన్నారు.

క్షేత్ర స్థాయిలో ప్రజల పక్షాన నిలవండి: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు : 

                     అంతకు ముందు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఓ రాజకీయ పార్టీగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులతో పాటు ఎన్నికల అనంతరం కొందరికి చిత్తశుద్ధితో పని చేస్తారన్న నమ్మకంతో శ్రీ పవన్ కల్యాణ్ గారు మీకు బాధ్యతలు అప్పగించారు. నాయకులు కూడా ఆ బాధ్యతలను అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.ఇప్పుడు పార్టీ తరఫున ఇంతకు ముందు ఏ రాజకీయ పార్టీ చేపట్టని రీతిలో క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాం. అందులో భాగంగా రూ. 5 లక్షల రూపాయిల ఇన్సురెన్స్ పథకాన్ని అధ్యక్షుల వారు ప్రారంభించారు. అధికారంలో ఉన్న పార్టీలు సైతం రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇన్సురెన్స్ తో పాటు మెడికల్ ఇన్సురెన్స్ సైతం అందే ఏర్పాటు చేయమని శ్రీ పవన్ కల్యాణ్ గారు సూచించారు. అది కూడా చేర్చాం. ఇది ప్రపంచ వ్యాప్తంగా వర్తిస్తుంది. ఇతర దేశాల్లో ఉన్న ఎన్.ఆర్.ఐ. జనసైనికులు పార్టీ బలోపేతం కోసం ఎనలేని కృషి చేస్తున్నారు. అటువంటి వారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ప్రపంచ వ్యాప్తంగా ఇది వర్తింపచేయాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాం. మీ అందరి సహకారంలో ప్రతి జిల్లాలో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

See also  శాఖలపై పట్టులేని మంత్రులకు జనసేన అధినేతను విమర్శించే స్థాయి లేదు : అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరామి రెడ్డి

                    ఇటువంటి ప్రభుత్వ పని తీరుని మనం ఎప్పుడూ చూడలేదు. రాజకీయాల కక్షలతో వేధిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సైతం ప్రజలకు వర్తింప చేసే విషయంలో వాలంటీర్  వ్యవస్థ సాయంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. అదే సమయంలో మన జనసైనికుల్ని ప్రతి సందర్భంలో ఇబ్బందులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అన్ని ప్రాంతాల్లో లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్సురెన్స్ పాలసీల కోసం సేవాభావంతో పని చేసే అడ్వకేట్లు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. జనసైనికులకు ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా స్పందించే విధంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియలా జరుగుతూ ఉండాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల పక్షాన నిలబడితేనే మీకు గౌరవం దక్కుతుంది. కోవిడ్ 19 తర్వాత ఎవరినీ ఇబ్బంది పెట్టరాదన్న ఉద్దేశంతో పార్టీ తరఫున కార్యక్రమాలు వ్యవహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు భావించారు. క్షేత్ర స్థాయిలో అవసరం అయిన సందర్భాల్లో జనసైనికులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. కూరగాయలు దగ్గర నుంచి మాస్కులు, శానిటైజర్లు పంచారు. తూర్పు గోదావరి జిల్లాలో రహదారులు కూడా జనసైనికులు నిర్మించేందుకు సిద్ధమైతే ప్రభుత్వం అడ్డుకొని కేసులు పెట్టింది. దయచేసి మీ స్థాయిలో ఉన్న సమస్యలపై మీరు స్పందించండి. జిల్లా స్థాయిలో సమస్యలపై నాయకులు మమేకమవ్వండి.

                      క్రియాశీలక సభ్యత్వాల విషయానికి వస్తే రాజోలు నియోజకవర్గంలో 1880 సభ్యత్వాలు చేశారు. ఎమ్మెల్యే వెళ్లిపోయినా, అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేసినా, ఇబ్బందులు పెట్టినా చక్కగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. మీరు కూడా మీ నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని పెంచండి. వారికి బాధ్యతలు అప్పగించండి. రాబోయే రోజుల్లో క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న వారందరికీ పదవులు ఇవ్వడానికి ప్రయత్నాలు చేద్దాం. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నాయకత్వాన్ని పెంచుకుంటూ వెళ్దాం. మనకి జిల్లా స్థాయిలో మంచి నాయకత్వం ఉంది. అయితే పార్టీ కార్యక్రమాలు చేసేప్పుడు అందర్నీ పిలవాలి. అది తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పాటిస్తున్నారు. 

                     పోలవరం వ్యవహారంలో కూడా పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది. విభజన సమయంలో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. ఆ ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలి. పోలవరం మాత్రం పూర్తవ్వాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోలవరం పూర్తి అవ్వాలి. పార్టీలకు అతీతంగా పోరాడాలని అప్పట్లోనే శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. కేవలం వాట్సప్ , ఫేస్ బుక్ లతో నాయకత్వం పెంచుకోలేం.. డోర్ టూ డోర్ పార్టీ బలోపేతానికి ఓటర్ కన్నా క్యాడర్ ముఖ్యం. క్యాడర్ ను దగ్గరకు తీసుకున్న తర్వాత ఓటర్ దగ్గరకు వెళ్తాం బైపాస్ చేసుకుని వెళ్తే మీరే నాయకులుగా నష్టపోతారు.. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడం కోసం అంతా సమయం కేటాయించండి” అన్నారు.

See also  కనకదిన్నె బ్రిడ్జి పనులను, మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని పత్తికొండ జనసేన నాయకుల వినతి