
– రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరి వెల్లడి
అనంతపురము, అక్టోబర్ 19, జనస్వరం : నిరంతర సాహితీ క్రతువులో భాగంగా అక్టోబర్ 26 వ తేది మదనపల్లిలో జాతీయ శతాధిక కవిసమ్మేళనం నిర్వహించనున్నట్లు శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు వెల్లడించారు. అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో “అన్నమయ్య సాహితీ ఉత్సవం” పేరిట ఘనంగా సాగుతుందని వివరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో శ్రీరామ కమ్యూనిటి హాల్లో అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిల్లీ, ఒడిస్సా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని 150 మంది పైగా కవులు హాజరుకానున్నట్లు చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 158వ శ్రీశ్రీ కళావేదిక ఫెస్ట్ గా అన్నమయ్య కమిటీ ఆధ్వర్యంలో, జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీ భూషణం నేతృత్వంలో వైభవంగా జరుగనుందన్నారు. కవితాగానం, సాహితీ సదస్సు, పుస్తకావిష్కరణ కార్యక్రమాలు వుంటాయన్నారు. తెలుగు భాష, సాహిత్యం, కళలు, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా శ్రీశ్రీ కళావేదిక నిరంతర సాహితీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతీనెలా ఒక్కో జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఏ విధమైన ఫీజు లేకుండా పాల్గొన్న కవులు, కళాకారులు అందరిని జ్ఞాపిక, శాలువా, పూలదండ, ప్రశంసా పత్రంతో ఘనంగా సత్కరించనున్నమన్నారు. పాల్గొన్న వారందరికీ ఉచిత భోజన వసతి సౌకర్యం కలిపించనున్నట్లు గుత్తా హరి సర్వోత్తమ నాయుడు తెలిపారు.








