
– కలుషిత ఐస్, కుళ్లిన పండ్లు, గడువు ముగిసిన పాల ప్యాకెట్ల ధ్వంసం
– పలువురు వ్యాపారులకు నోటీసులు
అనంతపురం, జూన్ 10 (జనస్వరం): నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులతో కలిసి జ్యూస్ సెంటర్లు, కూల్‌డ్రింక్స్ షాపులు, టీ కేఫ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పలు దుకాణాల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి చర్యలు చేపట్టారు. అంజన్న టీ కేఫ్‌లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం–2006 సెక్షన్ 31 కింద నోటీసులు జారీ చేసి, అనుమానాస్పద ఆహార నమూనాలను విశ్లేషణ కోసం సేకరించారు. జిహాన్ జ్యూస్ సెంటర్‌లో 15 కిలోల అపరిశుభ్రమైన ఐస్, 5 కిలోల కుళ్లిన పండ్లను గుర్తించి ధ్వంసం చేశారు. మాయాబజార్ టీ కేఫ్, వినాయక లస్సీ సెంటర్లకు కూడా సెక్షన్ 31 కింద నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్టార్ జ్యూస్ కార్నర్‌లో గడువు ముగిసిన 10 లీటర్ల పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేయడంతో పాటు నమూనాలను విశ్లేషణ కోసం సేకరించారు. ఎస్‌ఎల్‌వీ రోజ్ మిల్క్ సెంటర్ నుంచి ఒక చట్టబద్ధ నమూనాను సేకరించగా, మహావీర్ జ్యూస్ సెంటర్ నిర్వాహకుడికి పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి తస్లీమ్ మాట్లాడుతూ, ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా జిల్లాలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆహార వ్యాపారులు పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, గడువు ముగిసిన లేదా నాసిరకం ఆహార పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహార భద్రతా చట్టం–2006 నిబంధనలను ప్రతి వ్యాపారి పాటించాలని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పేర్కొన్నారు.








