పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల ఏర్పాట్ల పర్యవేక్షణ

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, జనవరి 5, (జనస్వరం) : పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ విచ్చేయనున్న సంక్రాంతి పండుగ సంబరాల ఏర్పాట్లను డీసీసీబి ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పర్యవేక్షించారు. జనవరి 9, 10, 11 తేదీల్లో పిఠాపురం పట్టణంలోని రాజీవ్ గాంధీ మున్సిపల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ వేడుకలకు సంబంధించి పవన్ కళ్యాణ్ దిగే ఎలీప్యాడ్ ప్రాంగణంతో పాటు ఇతర ఏర్పాట్లను జడ్పీ సీఈఓ, ప్రోగ్రాం ఇంచార్జ్ లక్ష్మణరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి సంబరాలకు భారీ సంఖ్యలో ప్రజలు, ముఖ్య అతిథులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన అన్ని వసతులు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులే ఈ వేడుకలకు ముఖ్య అతిథులని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అని పేర్కొంటూ, ఈ సందర్భంగా పిఠాపురంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను వర్చువల్‌గా సభా ప్రాంగణం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏటికొప్పాక బొమ్మల తయారీ విధానాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వీక్షించనున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

See also  అనారోగ్యంతో చనిపోయిన జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన తణుకు జనసేన నాయకులు