
– ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన మహిళా సభ్యురాలు రాధిక
అనంతపురం, ఏప్రిల్ 21, (జనస్వరం) : సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో అంబేద్కర్ భవన్ నిర్మాణం, విగ్రహ స్థాపనకు చర్యలు తీసుకోవాలని రాజ్యాంగ హక్కుల రక్షణ సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో సామాజిక, విద్యా కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన వేదిక లేకపోవడం వల్ల ఎస్సీ వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అంబేద్కర్ భవన్ నిర్మాణం ద్వారా పుస్తకాల వనరులు, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక శాశ్వత కేంద్రం ఏర్పడుతుందని వివరించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు గ్రామ స్థాయిలో విస్తరించేందుకు ఇది కీలకమని పేర్కొన్నారు. మహిళా సభ్యురాలు రాధిక మాట్లాడుతూ నేమకల్లు గ్రామంలో మహిళలు యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సరైన వేదిక లేకపోవడం బాధాకరమని అంబేద్కర్ భవన్ నిర్మాణం జరిగితే మహిళలకు శిక్షణ శిబిరాలు స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థిరమైన కేంద్రం లభిస్తుందని అంబేద్కర్ విగ్రహం యువతలో స్ఫూర్తి నింపి సమానత్వ భావనను బలపరుస్తుందని ప్రభుత్వం భూమి, నిధులు, అనుమతులు తక్షణమే మంజూరు చేయాలి అని ఆమె పేర్కొన్నారు. ప్రతినిధులు భవన నిర్మాణానికి భూమి కేటాయింపు, విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతి అవసరమైన నిధుల మంజూరు, ప్రాజెక్టును త్వరితగతిన అమలు చేయాలని అధికారులను కోరారు. నేమకల్లు గ్రామ ప్రజలు ఈ ప్రాజెక్టును ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, ఇది గ్రామ అభివృద్ధికి దోహదపడటంతో పాటు ఎస్సీ వర్గాల సామాజిక స్థాయిని మెరుగుపరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు వి.వై. మూర్తి, మహిళ సభ్యులు రాధిక, విజయమ్మ, సోము సుందరి, తిరుమలమ్మ, శ్యామల, రామకృష్ణమ్మ, లక్ష్మి, శాంతి మరియు గ్రామ వాసులు గంగన్న, శివ రుద్ర తదితరులు పాల్గొన్నారు.









