
క్రీడల్లో సత్తెనపల్లికి రాష్ట్ర స్థాయి గుర్తింపు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లి క్రీడల్లో స్వర్ణ, రజక, కాంస్య పతకాలు
విద్యలోనే కాదు క్రీడల్లోను అద్భుత ప్రతిభ
సత్తెనపల్లి,జూలై 02 ( జనస్వరం)
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లి క్రీడల్లో చరిత్ర సృష్టించింది.పాఠశాలలో పరిమిత వనరులు ఉన్నప్పటికీ దృఢ సంకల్పం, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే విజయం తప్పకుండా సొంతమవుతుందని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లి మరోసారి నిరూపించింది.కేంద్రీయ విద్యాలయం తెనాలిలో
జూన్ 27, 28తేదీలలో నిర్వహించిన అండర్ 17 బాలుర వాలీబాల్ జట్టు,29,30 తేదీలలో నిర్వహించిన పోటీల్లో అండర్-17 బాలికల వాలీబాల్ జట్టు రెండూ స్వర్ణ పతకాలు సాధించారు.అలాగే కేంద్రీయ విద్యాలయం ఎయిర్ ఫోర్స్ హకింపేట లో జూన్ 29,30 తేదీలలో జరిగిన పోటీల్లో అండర్-14 బాలికల వాలీబాల్ జట్టు రజత పతకం గెలుచుకుంది.
కేంద్రీయ విద్యాలయ, వరంగల్ లో జూన్ 29,30 తేదీలలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో అఖిలేష్ అండర్-19 బాలుర విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. లిఖిత అండర్-14 బాలికల విభాగంలో రజత పతకం, అదే విభాగంలో నమ్రత కాంస్య పతకం సాధించి విజేతలు గా నిలిచారు.అదే విధంగా ఏప్రిల్ 26,27 తేదీలలో జరిగిన టేబుల్ టెన్నిస్ విభాగంలో గిరిధర్ అండర్-19 కాంస్య పతకం సాధించగా, కేంద్రీయ విద్యాలయం తిరుమలగిరిలో జరిగిన పోటీల్లో అండర్-14 బాస్కెట్‌బాల్ జట్టు కాంస్య పతకం గెలుచుకుంది.ఈ అద్భుత విజయాల ఫలితంగా విద్యాలయానికి చెందిన పలువురు క్రీడాకారులు ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లి విద్యార్థులు జాతీయ క్రీడా పోటీల్లో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇది విద్యాలయానికి అత్యంత గర్వకారణమైన విషయం.
ఈ విజయాల వెనుక విద్యాలయ ఉపాధ్యాయులు కిరణ్ రెడ్డి నిరంతర కృషి, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, అంకితభావం మరియు విద్యార్థులపై ఉన్న విశ్వాసం విద్యార్థుల విజయనికి కారణంగా నిలిచాయి. 2022 నుండి 2026 వరకు వరుసగా ప్రాంతీయ స్థాయిలో స్వర్ణ పతకాలు సాధించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఆయన శిక్షణలో విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపిక కావడం విశేషం.విద్యాలయ ప్రధానోపాధ్యాయులు జగదీశ్ కుమార్ గుప్తా,విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి విద్యాలయ ఉపాధ్యాయుడు కిరణ్ రెడ్డిని అభినందిచారు.ఈ సందర్బంగా శిక్షణో ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను అత్యున్నత స్థాయికి చేర్చడం మా లక్ష్యం. క్రమశిక్షణ, నాయకత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయి. మా విద్యార్థులు జాతీయ స్థాయికి చేరుకోవడం విద్యాలయానికి గర్వకారణం” అని అన్నారు.

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లి చిన్న విద్యాలయమైనప్పటికీ, తన ప్రతిభ, అంకితభావం, సమర్థ నాయకత్వంతో రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో విశిష్ట గుర్తింపును పొందుతోంది. రాబోయే రోజుల్లో ఈ విజయగాథ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనే నమ్మకం అందరిలో వ్యక్తమవుతోంది అని పేర్కొన్నారు.








