
- వైసీపీ అధికార ప్రతినిధుల కొత్త ప్రయోగాలపై పార్టీలోనే అసంతృప్తి
వైసీపీలో కొందరు నేతలు చేస్తున్న వ్యవహారాలు ఇప్పుడు పార్టీకి మైలేజీ కంటే మైనస్‌లనే ఎక్కువగా తీసుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేస్తూ, పార్టీ కార్యక్రమాలను మాత్రం పక్క రాష్ట్రాల్లో నిర్వహించడం అనే కొత్త ట్రెండ్‌కు వైసీపీనే మార్గదర్శకంగా మారుతోందా అన్న ప్రశ్నలు పార్టీలోనే వినిపిస్తున్నాయి.
అధినేత జగన్మోహన్ రెడ్డి వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లికి వచ్చి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ, మిగతా రోజులు బెంగళూరుకు పరిమితమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే ఇప్పుడు మరికొందరు నేతలు, అధికార ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యక్షంగా చూడకుండానే రాజకీయాలు చేయవచ్చన్న ధోరణిని అలవాటు చేసుకుంటున్నారని పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ కోవలోనే అధికార ప్రతినిధి హోదాలో ఉన్న యాంకర్ శ్యామల వ్యవహారం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలంటూ వీడియోలు విడుదల చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వరకూ చూస్తే సాధారణంగానే అనిపించొచ్చు. కానీ ఆ పార్టీ తరఫున కార్యక్రమాలు, ఆందోళనలు, సమావేశాలు కూడా ఏపీలో కాకుండా హైదరాబాద్‌లో, అది కూడా తాను నివసిస్తున్న కూకట్‌పల్లి ప్రాంతంలోనే నిర్వహించడంపై మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సోషల్ మీడియా వచ్చాక రాజకీయాల రూపు మారింది అనేది నిజమే. విదేశాల్లో ఉంటూ సెల్ఫీ వీడియోలు తీసి రాజకీయ ప్రకటనలు చేసే రోజులు వచ్చాయి. పెద్ద నాయకుల విషయంలో అది ఓ స్థాయి వరకు సహజంగా కనిపించినా, అధికార ప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తులు కూడా అదే మార్గాన్ని ఎంచుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న వైసీపీలోనే వినిపిస్తోంది. పైగా ఆమె సేవలకు ఆర్థిక ప్రయోజనం కూడా అందుతుందన్న టాక్ ఉండటం ఈ చర్చను మరింత పెంచుతోంది. పార్టీ తరఫున జీతాల రూపంలో సేవలు అందిస్తున్నారన్న మాటలు కార్యకర్తల్లో గుసగుసలుగా మారాయి.
ఇటీవల పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టుల అంశంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. వారు అరెస్టై రెండు రోజులు గడిచిన తర్వాత, హైదరాబాదులో కూకట్పల్లిలో కారుమూరి వెంకటరెడ్డితో కలిసి ఆమె ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కూడా హైదరాబాదులోనే ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి సంతకాల సేకరణ చేపట్టారు. ఏపీకి సంబంధించిన అంశాలపై పోరాటాలు, నిరసనలు అన్నీ తెలంగాణ రాజధానిలోనే జరుగుతున్నాయన్న విమర్శలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
యాంకర్ శ్యామల వైఎస్సార్ కాంగ్రెస్ కోసం తన బుల్లితెర కెరీర్‌ను వదిలేశారని పార్టీ వర్గాలే చెబుతుంటాయి. అటువంటి నేపధ్యంలో ఆమెకు పార్టీ నుంచి కొంత మొత్తం పారితోషికం అందుతోందన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. అందుకే కావచ్చు, ఏపీకి రాకుండా హైదరాబాద్ నుంచే రాజకీయాలు సాగిస్తున్నారన్న వ్యాఖ్యలు తెరపైకి వస్తున్నాయి.
ఇదే అంశంపై ఇప్పుడు ఇతర వైసీపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “మాకూ అలాంటి అవకాశం ఇవ్వాలి, మేమూ ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తాం” అంటూ సెటైర్లు వేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇది వ్యక్తిగత విమర్శ కంటే పార్టీ వ్యవస్థపై వస్తున్న ప్రశ్నగా మారుతోంది.
మొత్తానికి చూస్తే, ఏపీలో ప్రజల మధ్య ఉండాల్సిన రాజకీయాలు, హైదరాబాద్ స్టూడియోలు, కూకట్‌పల్లి కార్యక్రమాలుగా మారడం వైసీపీకి లాభమా..? నష్టమా..? అన్నదానిపై ఆ పార్టీ హైకమాండ్ ఆలోచించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల మధ్య లేకుండా, రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చేసే రాజకీయాలు ఎంతవరకు ప్రభావవంతమో అన్న సందేహం వైసీపీని వెంటాడుతోంది.
జమ్ము సాయి కల్యాణ్,
పొలిటికల్ అనలిస్టు.








