
– గొర్తి ఉదయ్ కిరణ్ కు బ్రిటన్ పార్లమెంట్ లో ఘనసత్కారం
అనంతపురము, జూన్ 27, ( జనస్వరం ) : నగరానికి చెందిన యువ పరిశోధకుడు, సామాజిక అధ్యయనశీలి గొర్తి ఉదయ్ కిరణ్ కు లండన్ లో అరుదైన గౌరవం దక్కింది. ఈ వేడుకలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) సంస్థ సిఈఓ సంతోష్ శుక్లా, రాజేష్ శుక్ల, బ్రిటన్ పార్లమెంటు సభ్యులు గరేత్ బకాన్, వీరేంద్ర శర్మ, మిస్ ఇంగ్లాండ్ లిమిటెడ్ డైరెక్టర్ యాంజీ బిస్లె తదితరులు అవార్డును అందజేశారు. “గ్రామీణ యువతపై సోషల్ మీడియా ప్రభావం : ఒక అధ్యయనం” అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనా పత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. లండన్ నగరంలోని బ్రిటన్ పార్లమెంట్ సభా మందిరంలో ఉదయ్ కిరణ్ ను ఘనంగా సత్కరించారు. ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ నల్లాని రాజేశ్వరి, ప్రభుత్వ హెడ్మాష్టర్ గొర్తి వెంకటస్వామి దంపతుల కుమారుడైన ఉదయ్ కిరణ్ ను ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., సోషియాలజీ పూర్తి చేసిన ఉదయ్ కిరణ్ ప్రస్తుతం పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నారు. అనంతపురం రామ్ నగర్ లోని ఉదయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఐదవ తరగతి వరకు ప్రాథమికవిద్య నభ్యసించారు. ఇక్కడ జాతీయ రహదారి లోని శ్రీ చైతన్య పాఠశాలలో 6, 7 తరగతులు పూర్తి చేశారు. బెంగళూరు వద్ద ఆకాష్ ఇంటర్నేషనల్ స్కూల్లో 9 నుంచి 12 వ తరగతి వరకూ సిబిఎస్ఈ సిలబస్ లో మంచి ఫలితాలు సాధించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదువుతూ, కెపి 21 వ సెంచరీ ఐఏఎస్ అకాడమీలో యూపీఎస్సీ పరీక్షలకు ప్రాథమిక శిక్షణ పొందారు. బి.ఏ., (ఈపిపి) పూర్తిచేశాక, ఢిల్లీలోని ప్రముఖ శిక్షణా సంస్థ నుంచి ఆన్లైన్ ద్వారా తర్పీదు పొందుతున్నారు. అంతర్జాతీయంగా సింగపూర్, దుబాయ్, బ్రిటన్ వంటి దేశాలను సందర్శించారు. దేశంలో ప్రసిద్ధి పొందిన విద్యావేత్తలు, సామాజికవేత్తలను వ్యక్తిగతంగా కలిసి పలు అంశాలపై చర్చించి మంచి అవగాహనను పెంచుకున్నారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు రాస్, పాస్, ఆర్.డి.టి. ల కార్యక్రమాలను ప్రత్యేకంగా పరిశీలించారు. వారు నిర్వహిస్తున్న అనాథల, అంధుల, వృద్ధుల ఆశ్రమాలను తరచూ సందర్శించారు. ఎస్వీ యూనివర్సిటీలో ఎం.ఏ., (సోషియాలజీ) చదివే కాలంలో ప్రాజెక్టు వర్క్ గా చేసిన అంశం మీద ఆసక్తితో మరింత లోతుగా అధ్యయనం సాగించారు. రాయలసీమ జిల్లాల్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి యువత మీద సామాజిక మాధ్యమాల ప్రభావం గురించి ప్రత్యేక అధ్యయనం చేశారు. నగరాలతో పాటు గ్రామాలను కూడా సోషల్ మీడియా బాగా ఆకర్షించినట్లు గమనించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై కూడా ప్రత్యేక అధ్యాయాల్లో లోతుగా చర్చించారు. ఫలితాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన ఉదయ్ కిరణ్ తనదైన శైలిలో విశ్లేషించారు. మెంటార్ చంద్రశేఖర్, తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో తన పరిశోధనా పత్రాలను “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్” (లండన్) వారి దృష్టికి తీసుకెళ్లారు. సామాజిక అంశాల పట్ల ఇతనికున్న ఆసక్తి, అవగాహనను గుర్తించిన ఆ సంస్థ సిఈఓ సంతోష్ శుక్లా ప్రత్యేకంగా లండన్ కు ఆహ్వానించారు. సాక్షాత్తూ బ్రిటన్ పార్లమెంట్ లోని సభామందిరంలో ఘనంగా సత్కరించారు. అక్కడి పార్లమెంట్ సభ్యుల డైనింగ్ హాల్ లోనే బ్రిటిష్ అధికారులు, ఎంపి లతో కలిసి గౌరవంగా విందును కూడా ఏర్పాటు చేశారు. బ్రిటన్ పార్లమెంట్ ను సందర్శించే అరుదైన అవకాశం తనకు రావడం పట్ల సామాజిక పరిశోధక విద్యార్థి గొర్తి ఉదయ్ కిరణ్ ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశంలో గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక సాధికారత కోసం భవిష్యత్తులో తన వంతు కృషి సాగిస్తానని ఉదయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇది గొప్ప మైలురాయి : సిఈఓ
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన 10వ సమ్మిట్ – అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవం యూకే పార్లమెంట్‌లోని ప్రతిష్టాత్మకమైన హౌస్ ఆఫ్ కామన్స్, ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మిన్‌స్టర్‌లో ఘనంగా జరిగిందని అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుక సంస్థ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సమావేశాలలో ఒకటిగా నిలవనుంది. ఈ విశిష్టమైన వేడుక, యూకే (యునైటెడ్ కింగ్‌డమ్), యూఎస్ఏ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా), రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా, నేపాల్, కజకిస్తాన్, కెనడా, మెక్సికో, పోర్చుగల్, స్పెయిన్, స్విట్జర్లాండ్, బెల్జియం, జర్మనీ, ఈజిప్ట్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, పోలాండ్, జపాన్, ఆస్ట్రేలియా, మారిషస్ దేశాల నుండి వచ్చిన అత్యుత్తమ వ్యక్తులు, సంస్థలను సత్కరించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రజా సేవ, దౌత్యం, వ్యాపార రంగాలలో రాణించిన వారిని కీర్తించింది.
ఈ వేడుకలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) సంస్థ సిఈఓ సంతోష్ శుక్లా, రాజేష్ శుక్ల, బ్రిటన్ పార్లమెంటు సభ్యులు గరేత్ బకాన్, వీరేంద్ర శర్మ, మిస్ ఇంగ్లాండ్ లిమిటెడ్ డైరెక్టర్ యాంజీ బిస్లె తదితరులు అవార్డును అందజేశారు. ప్రపంచ ప్రముఖులు, క్యాబినెట్ మంత్రులు, దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ వ్యాపార నాయకులు వంటి ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. విభిన్న దేశాలు, రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్న ఈ వేడుక, అర్థవంతమైన చర్చలను ప్రోత్సహించి, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ప్రపంచ ఐక్యత, గుర్తింపు, పురోగతిని ప్రోత్సహించడంలో ఈ వేడుకల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా సభలో ప్రకటన చేశారు. ఈ వేడుక శ్రేష్ఠతను గౌరవించడమే కాకుండా, ప్రపంచ పరివర్తన దిశగా సామూహిక బాధ్యతను ప్రేరేపిస్తుందని ఆయన పేర్కొన్నారు. దాని అంతర్జాతీయ ప్రభావం, ఉన్నత స్థాయి భాగస్వామ్యంతో, 10వ సమ్మిట్ – అవార్డుల ప్రదానోత్సవం యూకే పార్లమెంట్ నడిబొడ్డున ఒక మైలురాయి సమావేశంగా నిలుస్తుందని వాగ్దానం చేశారు.








