డెంకాడ సమస్యలపై ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి వినతిపత్రం

నెల్లిమర్ల, ఫిబ్రవరి 16 (జనస్వరం): నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవిని డెంకాడ ప్రాంత నాయకులు, గ్రామస్తులు కలిసి రెండు ప్రధాన సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. విజయనగరం–నాతవలస ఆర్&బీ రోడ్డును VMRDA మాస్టర్ ప్లాన్ 2021–2041లో 45 మీటర్ల వెడల్పుతో విస్తరించాలన్న ప్రతిపాదనపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. ఈ ప్రణాళిక అమలైతే డెంకాడ, దొడ్డిబాడువ, చందకపేట గ్రామాల్లో సుమారు 300 కుటుంబాలు ఇళ్లు కోల్పోయి 1,500 మంది నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గ్రామ మధ్య నుంచి కాకుండా జనావాసాలకు నష్టం కలగకుండా బైపాస్ రోడ్డుగా మార్పు చేయాలని కోరారు. అదేవిధంగా డెంకాడ, పెడాడ, బంటుపల్లి, గుణుపూరు గ్రామాల్లో ఐటీ పార్క్ కోసం సుమారు 1,000 ఎకరాల సాగుభూముల భూసేకరణ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకించారు. రెండు పంటలు పండే భూములపై ఆధారపడిన వెయ్యిమంది చిన్న, సన్నకారు రైతులు ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను వినిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సానుకూలంగా స్పందిస్తూ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులు, నివాసితులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రాంతీయ ప్రతినిధులు, రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

See also  హిందూపురంలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కొరియన్ కనకరాజు విజయోత్సవ వేడుకలు