
– ఏపీఎంఏపీ బోర్డు సిఈఓ ఆవుల చంద్రశేఖర్ కు మాతృ వియోగం
తిరుపతి, ఆగష్టు 11, జనస్వరం : చంద్రగిరి మండలం పనబాకం గ్రామానికి చెందిన దేశ భక్తురాలు, శతాధిక వృద్ధురాలు ఆవుల చెంగమ్మ (101) మంగళవారం కన్నుమూశారు. భారత స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వారి అరాచకాల మీద తిరుగుబాటు చేసిన కుటుంబానికి చెందిన ఆమె, అన్నదాతగా కూడా పేరు గడించారు. వలసపాలనలోనే అటవీశాఖలో ఉద్యోగిగా వున్న ఆమె బావ ఒకరు, బ్రిటిష్ అధికారి నిరంకుశ వైఖరి పట్ల తొలిసారిగా తిరుగుబాటు చేశారు. దీంతో వీరి కుటుంబం కొంతకాలం అజ్ఞాత జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో కుటుంబ భారాన్ని మొత్తం చెంగమ్మ మోయడమే కాకుండా, ఎంతో ధైర్యంగా గ్రామంలో దేశభక్తి భావాలను పెంపొందింపజేశారు. అప్పట్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు, బెదిరింపులు ఎదురైనా తలొగ్గని సాహసిగా పేరు పొందారు. సామాజిక చైతన్యంతో అక్షరాస్యత పెంపుకోసం ప్రయత్నిస్తూ, పేదలకు అన్నపూర్ణగా తనదైన శైలిలో సేవలందించారు. తమిళనాడు రాష్ట్రంలో 1925లో జన్మించిన ఆమె అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. బాల్యం నుంచే భారతీయ సాహిత్యాన్ని, దేశభక్తిని ప్రచారం చేస్తూ వచ్చారు. వివాహం తర్వాత భర్త స్వగ్రామం, స్వర్ణముఖి నదీపరివాహక ప్రాంతమైన పనబాకం గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. ఆమె భర్త రామయ్య అటవీశాఖలో ఉద్యోగిగా వుంటూనే, వ్యవసాయం కూడా చేసేవారు. ప్రస్తుతం రాష్ట్ర అటవీశాఖలో డిప్యూటీ కన్జర్వేటర్ హోదాలో ఉన్నతాధికారిగా ఉన్న ఆమె కుమారుడు ఆవుల చంద్రశేఖర్ ఇటీవల లండన్ లో అంతర్జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ) గా విజయవాడలో ఆయన పనిచేస్తున్నారు. సిఈఓ మాతృమూర్తి, శతాధిక వృద్ధురాలు చెంగమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, బుధవారం పనబాకం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.








