
విజయవాడ, అక్టోబర్ 6, (జనస్వరం) : విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి ట్రస్ట్ బోర్డు సమావేశం శనివారం నిర్వహించగా, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ తరఫున బోర్డు సభ్యురాలిగా నియమితులైన ఠాకూర్ పద్మావతి, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే చంటి పిల్లల తల్లులు, బాలింతలకు పాలు పట్టేందుకు ప్రత్యేక వసతులు కల్పించాలని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనను ట్రస్ట్ బోర్డు వెంటనే ఆమోదిస్తూ, తగిన ఏర్పాట్లు తక్షణమే ప్రారంభించాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆలయ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిన పద్మావతిని చైర్మన్, ఈవోతో పాటు పాలకమండలి సభ్యులు అభినందించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పద్మావతి కృతజ్ఞతలు తెలిపారు.








