
– భక్తులకు తాంబూలం పంపిణీ
– అనంతరం పరిపాలన భవనం, సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవం
బుచ్చిరెడ్డిపాళెం, జూలై 24 (జనస్వరం) :మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తాంబూలం పంపిణీ చేశారు. తర్వాత ఆలయంలో నూతనంగా పునరుద్ధరించిన పరిపాలన భవనం, 40 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ఆషాఢమాసంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. దాదాపు 20 సంవత్సరాలుగా సరైన వసతులు లేక ఆలయ పరిపాలన ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా దేవస్థానం నిధులతో రూ.10 లక్షల వ్యయంతో పరిపాలన భవనాన్ని పునరుద్ధరించి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆలయంలో విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు రూ.20 లక్షల వ్యయంతో 40 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి చలువాది మల్లికార్జునరావు–శివకుమారి దంపతులు రూ.10 లక్షలు, మారేపల్లి చంద్రశేఖర్ రెడ్డి–మనోరమ రెడ్డి దంపతులు రూ.5 లక్షలు విరాళంగా అందించగా, మిగిలిన రూ.5 లక్షలను దేవస్థానం నిధుల నుంచి సమకూర్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు, విద్యుత్ శాఖ అధికారులు, ఆలయ ఈవో, చైర్మన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం దేవస్థానం పేరుపై రూ.16 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉందని ఎమ్మెల్యే తెలిపారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆలయం రూ.40 లక్షల అప్పుల్లో ఉండేదని గుర్తు చేశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు కూడా నిధులు లేని పరిస్థితుల్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసి రూ.50 లక్షలు మంజూరు చేయించామని చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో ఆలయ మిగులు ఆదాయంతో రూ.4 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయగలిగామని పేర్కొన్నారు. ఇదంతా అమ్మవారి కృపతో పాటు భక్తుల విశ్వాసం వల్లే సాధ్యమైందని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో జొన్నవాడ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఈవో, అధికారులు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్న అర్చకులకు ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బెజవాడ జగదీశ్, గ్రామ నాయకులు పెంచలయ్య, ఉమయస్వామి, ట్రస్టు బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








