నెల్లిమర్లలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే లోకం మాధవి

నెల్లిమర్ల, జనవరి 03, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. శనివారం ఆమె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా, విజయవంతంగా జరిగింది. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వందలాది మంది ప్రజలు హాజరై తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజా దర్బార్‌లో విద్యుత్, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, తాగునీరు, ఉపాధి వంటి అనేక అంశాలపై ప్రజలు వినతులు సమర్పించారు. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని, పాడైపోయిన సీసీ రోడ్లను మరమ్మతులు చేయాలని ప్రజలు కోరారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, వితంతు పెన్షన్ల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే స్పందిస్తూ, ప్రతి సమస్యకు ప్రాధాన్యత ఇచ్చి దశలవారీగా పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఏటి అగ్రహారం గ్రామానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న టీఆర్టీఎస్ ప్రాజెక్ట్ పరిహార అంశాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను తాను ఒక సవాల్‌గా స్వీకరిస్తున్నట్లు లోకం నాగ మాధవి పేర్కొన్నారు. ఈ విషయంపై జలవనరుల శాఖ మంత్రితో చర్చించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే ఫోన్ ద్వారా మాట్లాడి, సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తామని, ప్రజా ప్రతినిధులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.

See also  అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు