
నెల్లిమర్ల, జనవరి 10, (జనస్వరం) : వేట కోసం సముద్రంలోకి వెళ్లి అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలను నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి పరామర్శించారు. శనివారం బాధిత కుటుంబాల నివాసాలకు వెళ్లిన ఆమె, వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. బందీగా ఉన్న మత్స్యకారుల్లో ఒకరి భార్య ఇటీవల మగబిడ్డకు జన్మనివ్వగా, పుట్టినప్పటి నుంచే శిశువు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. తీవ్ర మనోవేదనలో ఉన్న బాలింతను ఓదార్చిన ఎమ్మెల్యే, చిన్నారి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తండ్రి దూరంగా ఉండగా పుట్టిన బిడ్డ అనారోగ్యానికి గురికావడం బాధాకరమని, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, బందీలుగా ఉన్న మన మత్స్యకారులను విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, వీలైనంత త్వరగా వారు క్షేమంగా స్వదేశానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









