MSSS సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి ప్రతిభావంతులకు ప్రతిభ పురస్కార అవార్డులు

రాప్తాడు, మే 19 (జనస్వరం) : మాదిగ సంక్షేమ సేవా సంఘం (ఎంఎస్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సాకే రామతీర్థ, జిల్లా అధ్యక్షులు మన్నల సుబ్రమణ్యం విద్యార్థులను అభినందించి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉంటుందని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన విద్యా హక్కును సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో గొప్ప స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు మరిన్ని విద్యా అవకాశాలు కల్పించేందుకు సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్య లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే ఉన్నత స్థానాలు సాధించగలరని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలకు చెందిన మొత్తం 30 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ అవార్డులు చెన్నేకొత్తపల్లిలో అందజేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఎక్కలూరి నాగరాజు, కోటంక మల్లేష్, రాణా ప్రతాప్, పేరూరు శ్రీరాములు, ధనుంజయ, గూడూరు చంటి తదితరులు పాల్గొన్నారు.

See also  చేనేత కుటుంబానికి అండగా జనసేన పార్టీ