
నంద్యాల, మార్చి 29, జనస్వరం : భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, కర్నూలు కిమ్స్ ఆసుపత్రి కడల్స్ తల్లి, చిన్నపిల్లల వైద్య విభాగం సహకారంతో స్థానిక ప్రైవేట్ హోటల్ సమావేశ భవనంలో వైద్య సదస్సు నిర్వహించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో జరిగిన ఈ సదస్సును ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ ప్రారంభించారు. కర్నూలు కిమ్స్ ఆసుపత్రి చిన్నపిల్లల శస్త్ర చికిత్స నిపుణురాలు డాక్టర్ సాయి ప్రసూన చిన్నపిల్లలలో మూత్ర వ్యవస్థ శస్త్ర చికిత్సలపై, చిన్నపిల్లల అత్యవసర చికిత్సలో నూతన విధానాలపై డాక్టర్ రవి కిరణ్, నవజాత శిశువుల వైద్య చికిత్సలో ఆధునిక విధానాలపై డాక్టర్ అబ్దుల్ నవీద్ మల్టీమీడియా ప్రదర్శనల ద్వారా వివరించారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ వైద్యులు తమ వైద్య పరిజ్ఞానాన్ని నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఆధునిక వైద్య విధానాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించగలరన్నారు. ఈ సందర్భంగా వక్తలను ఐఎంఏ నంద్యాల తరఫున జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీతో పాటు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, నంద్యాల ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ మధుసూదన రెడ్డి, కిమ్స్ ఆసుపత్రి పరిపాలన సిబ్బంది నందయ్య, ఫయాజ్ అహ్మద్ మరియు అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.








