జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: జాప్

– జిల్లా కలెక్టర్‌కు జాప్ వినతిపత్రం

అనంతపురం, జూన్ 18 (జనస్వరం): జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని కోరుతూ జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాప్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ, జర్నలిస్టులు దశాబ్దాలుగా ప్రభుత్వం మరియు ప్రజల మధ్య వారధిగా పనిచేస్తూ సమాజాభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం ఆందోళనకరమని, మీడియా ప్రతినిధులకు ఇంటి స్థలాలు, ఆరోగ్య భద్రత, విద్యా ఫీజు రాయితీలు, సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజ హితం కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులకు తగిన గుర్తింపు, రక్షణ, సంక్షేమం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను పరిశీలించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాప్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగిరెడ్డి, నాయకులు రాజన్న రమేష్, చంద్రశేఖర్ రెడ్డి, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

See also  ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు వెంటనే పరిహారం అందించాలి : అనంతపురం జిల్లా జనసేన నాయకులు