
– 29 న ప్రదానం – డాక్టర్ నల్లాని రాజేశ్వరి హర్షం
అనంతపురము, మార్చి 7, జనస్వరం : కలకత్తా ఆంధ్ర సంఘం వారి ఉగాది విశిష్ట పురస్కారానికి అవనిగడ్డ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాల చైర్మన్, రాష్ట్ర అసెంబ్లీ నైతిక విలువల కమిటీ చైర్మన్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఎంపికయ్యారు. కలకత్తా ఆంధ్ర సంఘం 90 వసంతాల తెలుగు వెలుగులు కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 10:00 గంటలకు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను పురస్కరించుకొని బుద్ధప్రసాద్ గారికి “ఉగాది విశిష్ట పురస్కారం” ప్రదానం చేయనున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తులలో ఒకరిగా, విద్యా, సాంస్కృతిక రంగాలలో చేస్తున్న నిరంతర కృషి, తెలుగు భాష వికాసానికి అందిస్తున్న తోడ్పాటుకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా మండలికి అవార్డు రావడం పట్ల ప్రముఖ సామాజికవేత్త, రచయిత్రి, ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ నల్లాని రాజేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.








